రొమాన్స్.. యాక్షన్..?
ప్రస్తుతం దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న ‘మట్కా’ సినిమా ద్వారా మాస్ పాత్రలో అలరించనున్నారు వరుణ్ తేజ్. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే తెరపైకి రానుండగా తర్వాత వరుణ్ చేయనున్న సినిమాల గురించి కూడా చర్చలు సాగుతున్నాయి. దర్శకుడు మేర్లపాక గాంధీతో వరుణ్ ఓ సినిమా చేయనున్నారని, ఈ సినిమాని మరో దర్శకుడైన క్రిష్‌కి చెందిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించనున్నట్టు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి.
అయితే, తాజా సమాచారం ప్రకారం వరుణ్ మరో కథకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ‘టచ్ చేసి చూడు’ సినిమాతో దర్శకుడిగా మారిన విక్రమ్ సిరికొండ, వరుణ్ కోసం ఓ ప్రేమకథని సిద్ధం చేశారట. కాగా ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితం కానుందట. ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’ చిత్రాల తర్వాత వరుణ్ పూర్తిస్థాయిలో రొమాన్స్ జానర్ సినిమానే చేయలేదు. మేర్లపాక గాంధీ కథ కూడా యాక్షన్ ప్రధానంగా ఉండనుందట. ఈ నేపథ్యంలో తర్వాతి సినిమా కోసం వరుణ్ చేయనుంది “రొమాన్సా.. యాక్షనా..” అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.






