23 July, 2026 | 2:20 AM

మహిళా పోలీస్ స్టేషన్‌లో రూ.29 లక్షల వెయిటింగ్‌హాల్ ప్రారంభం

23-07-2026 01:14 AM
  1. మున్సిపల్కు రూ.43 లక్షల నూతన జేసీబీ
  2. పెద్దపల్లిలో ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు

పెద్దపల్లి, జూలై 22(విజయ క్రాంతి)పెద్దపల్లి పట్టణంలో మహిళా పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల సౌకర్యార్థం రూ.29 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన వెయిటింగ్ హాల్ను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు. అనంతరం పెద్దపల్లి మున్సిపాలిటీ రూ.43 లక్షలతో కొనుగోలు చేసిన నూతన జేసీబీ వాహనాన్ని ప్రారంభించి మున్సిపల్ అధికారులకు అప్పగించారు.ఈ సందర్భంగా విజయరమణరావు మాట్లాడుతూ, మహిళా పోలీస్ స్టేషన్కు జిల్లా వ్యాప్తంగా 14 మండలాలు, నాలుగు మున్సిపల్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు వస్తుండటంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వెయిటింగ్ హాల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పోలీసు శాఖ ప్రతిపాదన మేరకు ఈ నిర్మాణాన్ని చేపట్టామని చెప్పారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో గతంలో అభివృద్ధి పనుల కోసం జేసీబీని అద్దెకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉండేదని, ఇకపై మున్సిపాలిటీకి సొంత జేసీబీ అందుబాటులో ఉండటంతో పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీల శుభ్రత, అత్యవసర అభివృద్ధి పనులు మరింత వేగంగా చేపట్టే అవకాశం ఉంటుందని,పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, దశలవారీగా పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు.

రాబోయే కాలంలో ప్రభుత్వ ఆసుపత్రి, బస్సు డిపో, కోర్టు భవనం, బైపాస్ రోడ్డు నిర్మాణ పనులతో పాటు రహదారులు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకులు, తాగునీటి పైప్లైన్ల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.