23 March, 2026 | 11:23 PM

రూపాయి విలువ మరింత పతనం

22-03-2026 12:00 AM

ముచ్చుకోట సురేష్‌బాబు :

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను అతలాకుతలం చేస్తూ, ఆర్థిక విపణిలో తీవ్ర అనిశ్చితిని సృష్టించిన నేపథ్యంలో భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధం గా రికార్డు స్థాయి పతనానికి చేరుకుంది. చరిత్రలో తొలిసారిగా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 93 మార్కును దాటడం భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న బాహ్య ఒత్తిళ్లకు అద్దం పడుతోంది.

శుక్రవారం నాటి ఫారెక్స్ మార్కెట్ లావాదేవీల్లో రూపాయి 92.92 వద్ద ప్రారంభమైనప్పటికీ, రోజంతా సాగిన ఒత్తిడి కారణంగా ఒక దశలో 93.28 స్థాయికి పడిపోయి ఆందోళన కలిగించింది. ఈ వారం ఆరంభంలోనే 92.89 వద్ద బలహీనపడిన రూపాయి, తాజా పరిణామాలతో మరింత దిగజారింది. ఈ పతనానికి ప్రధానంగా పశ్చిమ ఆసియాలో తీవ్రతరమవుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు సుమారు 120 డాలర్ల వరకు పెరగడం భారత్ వంటి అతిపెద్ద చమురు దిగుమతి దేశానికి పెద్ద సవాలుగా మారింది. చమురు ధరలు పెరగడం వల్ల దేశ వాణిజ్య లోటు పెరగడమే కాకుండా, ద్రవ్యోల్బణం ఎగబాకి ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం పొంచి ఉంది. కేవలం ఇంధన ధరలే కాకుండా, విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణ కూడా రూపాయిని కోలుకోలేని దెబ్బతీస్తోంది.

మార్చి నెలలోనే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి సుమారు 8 బిలియన్ డాలర్ల నిధులను వెనక్కి తీసుకోవడం గమనార్హం. ఇది 2025 జనవరి తర్వాత నమోదైన అతిపెద్ద నెలవారీ ఉపసంహరణగా రికార్డులకు ఎక్కింది. అంతర్జాతీయంగా అనిశ్చితి పెరిగిన ప్రతిసారీ పెట్టుబడిదారులు తమ నిధులను సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లించడం వల్ల భారత స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలాయి.

దీని ప్రభావంతో సెన్సెక్స్ ఏకంగా 2,400 పాయింట్లకు పైగా పతనమవగా, నిఫ్టీ సూచీ కూడా 3 శాతానికి పైగా క్షీణించింది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రంగంలోకి దిగి విదేశీ మారక మార్కెట్లో డాలర్లను విక్రయిస్తూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. 2025 ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్య కాలంలోనే ఆర్బీఐ సుమారు 50 బిలియన్ డాలర్లకు పైగా విక్రయించినట్లు అంచనాలు ఉన్నప్పటికీ, డాలర్‌కు ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా రూపాయిపై ఒత్తిడి తగ్గడం లేదు.

భవిష్యత్తులో ఈ భౌగోళిక ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 95 స్థాయికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఏడాది కాలంలోనే రూపాయి తన విలువలో సుమారు 7 శాతం మేర కోల్పోవడం గమనార్హం. ప్రపంచ వాణిజ్య వివాదాలు, నిరంతర సంఘర్షణలు భారత కరెన్సీని బాహ్య ప్రభావాలకు లోనయ్యేలా చేస్తున్నాయి. ఆర్బీఐ జోక్యం వల్ల పెద్ద ఎత్తున జరిగే పతనాలు కొంతవరకు అదుపులోకి వస్తున్నప్పటికీ, దిగుమతి చేసుకునే ఇంధనంపై దేశం అధికంగా ఆధారపడటం రూపాయి బలహీనతకు కారణమైంది.

ఆర్థిక పరిస్థితులు భారత్‌కు సవాల్‌గా మారిన తరుణంలో, రాబోయే వారాల్లో చమురు ధరల గమనం, కేంద్ర ప్రభుత్వ విధానాలే రూపాయి భవిష్యత్తు దిశను నిర్ణయించనున్నాయి. పశ్చిమ ఆసియా సంభం మరింత ముదిరితే చమురు సరఫరా గొలుసు దెబ్బతిని భారత ఆర్థిక వ్యవస్థపై భారంగా మారే అవకాశం ఉన్నందున పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

- వ్యాసర్త సెల్: 99899 88912