శతక్కొట్టిన రుతురాజ్
తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్
ఉత్కంఠ పోరులో గెలిపించిన బౌలర్లు
ట్రై సిరీస్‌లో భారత్ ఏ బోణీ
టాపార్డర్ ఫెయిల్... 69 పరుగులకే 3 వికెట్లు... ఈ దశలో కెప్టెన్ తిలక్ వర్మ, వైస్ కెప్టెన్ రుతురాజ్ కీలక పార్టనర్ షిప్‌తో మంచి స్కోరు వచ్చింది. అయితే లంక ఏ బ్యాటర్లు పోరాటంతో గెలవడం కష్టమే అనిపించింది. అయితే చివర్లో అద్భుతంగా పుంజుకున్న భారత్ ఏ బౌలర్లు ఉత్కంఠ పోరులో విజయాన్ని అందించారు. ఫలితంగా ముక్కోణపు సిరీస్ లో భారత్ ఏ జట్టు బోణీ కొట్టింది.
కొలంబో, జూన్ 8: ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఏ కెప్టెన్ తిలక్ వర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఐపీఎల్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ నిరాశ పరిచాడు. 12 బంతుల్లో 14 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ వెంటనే 11 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసిన ప్రబ్‌సిమ్రాన్ సింగ్ పెవిలియన్ బాట పట్టాడు.
దాంతో భారత్ 16 పరుగులకే ఓపెనర్లు వికెట్లు చేజార్చుకుంది. తర్వాత ప్రియాన్ష్ ఆర్య రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఈ ఇద్దరూ మూడో వికెట్కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొ ల్పారు. 32 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 32 పరుగులు చేసిన ప్రియాన్ష్ రనౌట్ అయ్యాడు. దాంతో భారత్ 69 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.
మిడిలార్డర్లో వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ - రుతురాజ్ గైక్వాడ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు ఏకంగా 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమం లోనే రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 114 బంతులు ఆడిన గైక్వాడ్ ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 101 పరుగులు చేసి అవుటయ్యాడు.
ఆ వెంట నే 97 బంతుల్లో 60 పరుగులు చేసి తిలక్ వర్మ కూడా వికెట్ కోల్పోయాడు. ఆఖర్లో ఆయుష్ బదోనీ 18 బంతుల్లో 24, సూర్యాన్షు షెడ్జే 14 బంతుల్లో 26 పరుగులు చేయడం తో భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్ రెండు వికెట్లు పడగొట్టగా, చమీకా కరుణ రత్నే ఒకటి, గరుక సంకేత ఒకటి, వాంజ సహాన్ ఒక వికెట్ తీసుకున్నారు.
అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, సాహన్ అరచ్చిగే (74), నిరోషన్ డిక్వెల్లా (47), సమరవిక్రమ (46) రాణించడంతో ఓ దశలో (262/6) గెలుపు దిశగా సాగింది. అయితే చివరి రెండు ఓవర్ల లో కేవలం 10 పరుగులు అవసరమైన సమయంలో భారత్ బౌలర్లు అద్భుతంగా పుంజు కున్నారు. ఒత్తిడిలో చక్కగా బౌలింగ్ చేసి లంక ను దెబ్బకొట్టారు.
ఫలితంగా శ్రీలంక వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి 269 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. అర్షద్‌ఖాన్, ఆయుష్ బదోని, అనుకూల్ రాయ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా, అన్షుల్ కంబోజ్ ఓ వికెట్ పడగొట్టింది. సెంచరీతో అదరగొట్టిన రుతురాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తర్వాతి మ్యాచ్‌లో గురువారం భారత్-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ తలపడ నున్నాయి.
స్కోరు బోర్డు:
భారత్ ఏ ఇన్నింగ్స్ : 277/6 ( రుతురాజ్ 101 , తిలక్ వర్మ 60 , ప్రియాన్ష్ ఆర్య 32 ; షిరాజ్ 2/67, చమీకా కరుణ రత్నే 1/46 )
శ్రీలంక ఏ ఇన్నింగ్స్ : 269 ( సాహన్ అరచ్చిగే 74, నిరోషన్ డిక్వెల్లా 47, సమరవిక్రమ 46 ; అర్షద్ ఖాన్ 2/24 , ఆయుష్ బదోనీ 2/46, విప్రజ్ నిగమ్ 2/46 )






