భవనాలు ఉన్నా.. నిధులు సున్నా

06-05-2024 12:45:04 AM

భారంగా మారిన రైతు వేదికలు

మెదక్ జిల్లాలో 76 రైతు వేదికలు ప్రశ్నార్థకం

నిర్వహణ ఖర్చు భరించలేక ఏఈవోల అవస్థలు

మెదక్, మే 5 (విజయక్రాంతి) : రైతులకు ఎల్లప్పుడు సలహాలు, సూచనలు అందించేందుకు గత ప్రభుత్వ హయాంలో రైతు వేదికలు నిర్మించారు. వ్యవసాయంలో వస్తున్న మార్పులను అన్నదాతలు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా సమావేశాలు నిర్వ హించేందుకు వీటిని వినియోగించారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని ఒక వేదికను ఆధునిక వ్యవసాయం గురించి శాస్త్రవేత్తలు తెలియజేసేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు పరికరాలు ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. నిధులు లేకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. మెదక్ జిల్లాలో 469 పంచాయతీల్లో 76 వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. వాటిలో రైతు వేదికలను రూ. 22లక్షల చొప్పున వెచ్చించి నిర్మించారు. వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి కార్యకలాపాలు నిర్వహించాలని గత ప్రభుత్వం సూచించింది. ప్రతిరోజు వారు రైతులకు అందుబాటులో ఉండి సహకారం అందిస్తున్నారు. తాగునీరు, స్టేషనరి, విద్యుత్ ఛార్జీలు, పారిశుధ్య నిర్వహణకు నెలకు రూ. 9వేల చొప్పున అందజేస్తామని అప్పటి ప్రభుత్వం తెలిపింది. అయితే ౨౦ నెలలుగా నిధులు మాత్రం విడుదల చేయలేదు. ఇలా ఒక్కో వేదికకు రూ. 1.71 లక్షలు రావాల్సి ఉంది. ఇలా జిల్లా వ్యాప్తంగా 76 రైతు వేదికలకు రూ. 1,29,96,000 రావాల్సి ఉంది. దీంతో వివిధ అవసరాలకు ఏఈవోలు తమ సొంత డబ్బులను ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం రైతు వేదికలకు విద్యుత్ బకాయిలు చాలా ఉన్నాయి. 2022 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మాత్రమే రూ. 45 వేల బిల్లులు చెల్లించి తర్వాత ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. 

శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, రైతు లు ప్రతి మంగళవారం సమావేశమై ఆధునిక పద్ధతులు, సాగు సమస్యలపై చర్చించేందుకు వీలుగా వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంపిక చేశారు. ఇందులో కుర్చీలు, టేబుళ్లు, టెలివిజన్ సెటప్ బాక్సులు, ఇన్వర్టర్లు ఇతర సామగ్రిని ఏర్పాటు చేశారు. వీడియో కార్యక్రమాల ద్వారా శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయాధికారులు రైతులతో నేరుగా మాట్లాడి పంటల సాగు విధానం, చీడపీడల నివారణ, ప్రభుత్వ పథకాల తదితర వాటిపై అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నా 20 నెలలుగా నిర్వహణ నిధులు ఇవ్వకపోవడం వల్ల భారం గా ఉన్నదని అధికారులు వాపోతున్నారు. 

ప్రభుత్వం దృష్టికితీసుకెళ్లాం..

 జిల్లాలో ఉన్న రైతు వేదికల నిర్వహణ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తు తం ఏఈవోలే భరిస్తున్నారు. త్వరలోనే నిధులు వచ్చే అవకాశం ఉంది. 

 గోవింద్, మెదక్ జిల్లా వ్యవసాయాధికారి