కంటోన్మెంట్ ఫైట్‌లో... సానుభూతి గెలిచేనా..!

06-05-2024 12:13:36 AM

చిన్న నియోజకవర్గంలో పెద్ద నాయకుల ప్రచారం

గెలుపుపై ఎవరి ధీమా వారిదే

నాన్న, చెల్లిని కోల్పోయిన దుఃఖంతోనే ప్రచారం 

ఈసారైనా గెలిపించండంటున్న శ్రీగణేష్

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (విజయక్రాంతి): కంటోన్మెంట్ చరిత్రలోనే అత్యధికసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తి సాయన్న. ఐదు పర్యాయాల పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా విజయం సాధించి సాయన్న అంటే కంటోన్మెంట్.. కంటోన్మెంట్ అంటే సాయన్న అన్నట్లుగా అక్కడి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. హఠాత్తుగా అనారోగ్యంతో 2023 ఫిబ్రవరి 19న మరణించారు. తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన సాయన్న చిన్నకూతురు మాజీ కార్పొరేటర్ లాస్య నందిత తండ్రి బాటలోనే బీఆర్‌ఎస్ అభ్యర్థిగా 2023లో బరిలో నిలిచి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గద్దర్ కూతురు వెన్నెలపై విజయం సాధించారు.

కేవలం రెండున్నర నెలల మాత్రమే ఎమ్మెల్యేగా పని చేసిన లాస్య నందిత 2024 ఫిబ్రవరి 23న ఔటర్‌రింగు రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారడంతో ప్రస్తుతం జరుగతున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు కంటోన్మెంట్  అసెంబ్లీ స్థానానికి కూడా ఎన్నికలు జరుగతున్నాయి. పుట్టెడు దుఃఖంలో ఉన్న సాయన్న రెండో కూతురు నివేదిత కేసీఆర్ ఆశీర్వాదంతో కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే హోదాలోనే ఉన్న నాన్న, చెల్లిని కోల్పోయినప్పటికీ కంటోన్మెంట్‌ను నిలబెట్టేందుకు పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఉబికి వస్తున్న దుఃఖంతోనే కారు గుర్తుకు ఓటు వేయాలని కంటోన్మెంట్ ఓటర్లను నివేదిత అభ్యర్థిస్తున్నారు. 

టీఎన్ సదాలక్ష్మి వారసుడిగా..

కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా పని చేసిన టీఎన్. సదాలక్ష్మివారసుడిగా డాక్టర్ వంశీ తిలక్ బీజేపీ నుంచి పోటీలో దిగారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన టీఎన్ సదాలక్ష్మి ఏబీసీడీ వర్గీకరణ ఉద్యమానికి ఆధ్యురాలు. ప్రస్తుత ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా డైరెక్ట్‌గానే ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కంటోన్మెంట్‌లో కీలకంగా మారనున్నారు. కంటోన్మెంట్‌లో  గెలుపోటములు ఎలా ఉన్నా.. ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు మాత్రం సెంటిమెంట్‌ను ఆయుధంగా నమ్ముకొని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఈసారైనా గెలిపించండి

తనను ఈసారైనా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీగణేష్ కంటోన్మెంట్ ఓటర్లను కోరుతున్నారు. 2023 ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి బరిలో నిలిచిన ఆయన 41,888 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన గద్దర్ కుమార్తె వెన్నెలను కాదని కాంగ్రెస్ పార్టీ శ్రీగణేష్‌ను పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో పాటు గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కోసం శ్రీగణేష్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఇది చిన్న అసెంబ్లీ స్థానమైనప్పటికీ, ఇక్కడ ప్రచారం చేసేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పెద్ద పెద్ద నాయకులందరూ ప్రచారం చేస్తున్నారు. మూడు పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు కూడా సానుభూతినే నమ్ముకున్నారు. మరి సానుభూతి గెలిపిస్తుందా..? లేదా అనేది చూడాలి మరి.