బీటెక్ అకడమిక్ క్యాలెండర్ రిలీజ్
సెప్టెంబర్ 15లోపు తరగతులు ప్రారంభించాలి
ఏఐసీటీఈ ఆదేశాలు
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): 2024 విద్యా సంవ త్సరానికి గాను ఇంజనీరింగ్ ఫస్టియర్ తరగతులను సెప్టెంబర్ 15 లోపు ప్రారంభించాలని ఏఐసీటీఈ (అఖిల భారత సాంకేతిక విద్యామండలి) కళాశాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 2024 విద్యాసంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను ఏఐసీటీఈ విడుదల చేసింది. ఫస్టియర్‌తో పాటు సెకండియర్ లేటరల్ ఎంట్రీ తరగతులను సైతం సెప్టెంబర్ 15లోగా ప్రారంభించాలని ఆదేశించింది.
ఇప్పటికే ఏఐసీ టీఈ అఫిలియేషన్ (అనుబంధ గుర్తింపు) కోసం కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, ఆయా కాలేజీలకు ఎక్స్‌టెన్షన్ ఆఫ్ అప్రూవల్‌ను మాత్రం ఏఐసీటీఈ ఇంకా ఇవ్వలేదు. పీజీడీఎం, పీజీసీఎం కోర్సులు నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు జూన్ 10లోపు అనుమతులివ్వనుంది. గతంలో అప్రూవల్ తిరస్కరణకు గురైన కాలేజీలు తిరిగి జూన్ 30 లోపు అనుమతులు పొందాల్సి ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 11లోపు సీట్లను రద్దు చేసుకునే వెసులుబాటును కళాశాలలకు కల్పించింది.




