21-02-2026 01:29:57 AM
నేటి నుంచే సూపర్-8
భారత్‌కు సఫారీ, కరేబియన్ ఛాలెంజ్
కివీస్‌కు ఇంగ్లాండ్ గండం
సంచలనాలపై కన్నేసిన జింబాబ్వే
టీ20 ప్రపంచకప్‌లో తొలి అంకం ముగిసింది. గ్రూప్ స్జేజ్ నుంచి 12 జట్లు ఇంటిదారి పడితే 8 జట్లు తర్వాతి స్టేజ్ లో అడుగుపెట్టాయి. ఈ 10 రోజుల్లో రెండు మూడు సంచలనాలు తప్పిస్తే మిగిలిన మ్యాచ్‌లలో ఎక్కువ శాతం ఊహించిన జట్లే గెలిచాయి. అయితే సూపర్ 8 స్టేజ్ మాత్రం మామూలుగా ఉండేలా లేదు. టైటిల్ ఫేవరెట్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగడం ఖాయం. దీంతో ఇకపైనే అభిమానులు అసలు సిసలు క్రికెట్ మజా ఆస్వాదించబోతున్నారు.
కొలంబో, ఫిబ్రవరి 20: టీ20 ప్రపంచకప్ మొదలై 10 రోజులు దాటిపోయింది. గ్రూప్ స్టేజ్‌కు తెరపడింది. ఒకటి రెండు సంచలనాలు తప్పిస్తే దాదాపు చాలా మ్యాచ్‌లలో ఫేవరెట్ జట్లే గెలిచాయి. చిన్న జట్లలో కొన్ని ఆకట్టుకున్నా పెద్ద జట్లే ముందంజ వేశాయి. ఇప్పుడు శనివారం నుంచి సూపర్ 8కు రంగం సిద్ధమైంది. భారత్ , సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే గ్రూప్ 1లో చోటు దక్కించుకోగా... న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు గ్రూప్ 2లో ఉన్నాయి.
పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య కొలంబో వేదికగా జరిగే మ్యాచ్‌తో సూపర్ మజా మొదలుకాబోతోంది. ఎందుకంటే రెండు గ్రూపులు కూడా ఒకటికి మించి మరొకటి కనిపిస్తున్నాయి. ముందు భారత్ ఉన్న గ్రూప్ చూసుకుంటే వెస్టిండీస్, సౌతాఫ్రికాతో పాటు సంచలనాల జింబాబ్వే ఎంట్రీ ఇచ్చింది. ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లకు షాకిచ్చిన జింబాబ్వేను చూసి ఇప్పుడు మిగిలిన జట్లు అప్రమత్తమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సూపర్ 8లో ప్రతీ మ్యాచ్ కీలకమే. రన్ రేట్ కూడా కీలకమే. ఏజట్టు ప్రత్యర్థులను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. టైటిల్ ఫేవరెట్ రేసులో ముందున్న టీమిండియా కూడా ప్రత్యర్థి 3 జట్లనూ ఓడించాలంటే అంచనాలకు తగ్గట్టే రాణించాల్సి ఉంటుంది.
మరోవైపు గ్రూప్ బిలోనూ ఇదే పరిస్థితి.. ఇంతకుమించిన హోరాహోరీ పోరు కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంకతో పాటు పాక్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రీ సీడింగ్స్ ప్రకారం రెండు గ్రూపుల్లోనూ ఏ జట్లు కూడా గ్రూప్ స్టేజ్ లో తలపడలేదు. సూపర్ 8 స్టేజ్ ను మరింత రసవత్తరంగా మార్చేందుకే ఐసీసీ ఈ ప్రీ సీడింగ్స్ ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇకపై రోజుకు ఒక మ్యాచ్ జరగబోతుండగా.. టీ20 మజా మాత్రం డబుల్ కానుంది. సెమీస్ రేసులో నిలిచేందుకు ప్రతీ మ్యాచ్ లోనూ గెలుపు కీలకం కావడంతో అన్ని జట్లు సర్వశక్తులూ ఒడ్డుతాయి. అందుకే సూపర్ 8లో ప్రతీ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు జరగడం ఖాయమని అంచనా వేస్తున్నారు. జింబాబ్వే తప్పిస్తే చిన్న జట్లన్నీ కూడా ఇంటిదారి పట్టడంతో ఇకపై ఏకపక్ష ఫలితాలు కూడా ఉండవన్నది తేలిపోయింది.
ఈ నేపథ్యంలో అభిమానులకు ఇక సూపర్ 8 పండగే పండగ. కాగా భారత్ ఈ సూపర్ 8లో తొలి మ్యాచ్ ను సౌతాఫ్రికాతోనూ, తర్వాత వెస్టిండీస్ , ఆపై జింబాబ్వేతోనూ తలపడుతుంది. గ్రూప్ స్టేజ్ లో నాలుగు మ్యాచ్ లూ గెలిచినప్పటకీ కొన్ని బ్యాటింగ్ లోపాలు స్పష్టంగా కనిపించాయి. దానిని అధిగమించకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. అటు మిగిలిన జట్లలోనూ కొన్ని కొన్ని బలహీనతలు గ్రూప్ స్టేజ్ లోనే బయటపడ్డాయి.ఈ నేపథ్యంలో సూపర్ 8లో వాటిని రిపీట్ చేయకుండా ఉంటేనే సెమీస్ రేసులో నిలుస్తాయి. లేకుంటే సంచలనాలకు అవకాశం ఇవ్వడమే కాదు స్వదేశాలకు లగేజీ సర్దుకోవాల్సిందే.
గ్రూప్ 1: భారత్ , సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే
గ్రూప్ 2: న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక
సూపర్ భారత్ షెడ్యూల్
ఫిబ్రవరి 22 భారత్ X సౌతాఫ్రికా (అహ్మదాబాద్)
ఫిబ్రవరి 26 భారత్ X జింబాబ్వే (చెన్నై )
మార్చి 1 భారత్ X వెస్టిండీస్( కోల్‌కత్తా )