2 May, 2026 | 6:07 AM

ఆరోగ్యానికి సురక్షిత ఆహారం

07-06-2024 12:05 AM

మనం తీసుకుంటున్న ఆహారపదార్ధాల నాణ్యత మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కలుషితమైన ఆహారం అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న చాలా ఆహార పదార్ధాలు కల్తీవే..! ఈ మధ్యనే హైదరాబాద్‌లో పేరొందిన హోటల్స్‌లో కుళ్లిపోయిన మాంసం, నాసిరకం ఆహారపదార్థాలు ఉన్నాయని దాడులు నిర్వహించిన అధి కారులు నిర్ధారించడం మనకందరికీ తెలిసిందే. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని అను సరించి 2019 నుండి ప్రతి సంవత్సరం జూన్ 7న వరల్డ్ ఫుడ్ సేఫ్టీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

ఈ సంవత్సరం ‘సురక్షిత ఆహారం వాటికి సిధ్ధం’ అనే నేపథ్యంతో నిర్వహించబడుతోంది. ఇక్కడ ఊహించని వాటికి అంటే అనుకోకుండా ఆహారం ద్వారా వచ్చే కొన్ని వ్యాధులను ఎదుర్కోవాలని అర్థం. సురక్షితమైన ఆహారం  గురించి అవగాహన పెంచడానికి ఈ రోజును జరుపుకుంటాం. మనం తినే ఆహారం సురక్షితంగా ఉందని, మన ఆరోగ్యానికి హాని కలిగించదని నిర్ధారించుకోవడానికి ఈ రోజును పాటిస్తాం. ప్రభుత్వాలు, ఉత్పత్తిదారుల భాగస్వామ్యంతో వినియోగదారులు సురక్షిత ఆహారాన్ని పొందగలుగు తారు.

గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2022 ప్రకా రం 113 ప్రధాన దేశాలలో మన దేశం 68వ స్థానం లో ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2023 సురక్షిత ఆహారాన్ని నిర్ధారించడంలో రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇస్తుంది. ఇది సురక్షిత ఆహారంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును కొలిచే వార్షిక మూల్యాంకనం. ఈ సూచీలో పెద్ద రాష్ట్రాలలో కేరళ మొదటి స్థానంలో నిలవగా, పంజాబ్, తమిళనాడు తరువాతి స్థానాలలో ఉన్నాయి. చిన్న రాష్ట్రాల్లో గోవా అగ్రస్థానంలో నిలవగా, మణిపూర్, సిక్కిం రాష్ట్రాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్ముకశ్మీర్, ఢిల్లీ, చండీగఢ్ మొదటి, రెండు, మూడు ర్యాంకులు సాధించాయి.

కలుషిత ఆహారంతో నష్టాలు

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అరవై కోట్ల మంది లేదా పది మందిలో దాదాపు ఒకరు కలుషితమైన ఆహారం తిన్న తర్వాత అనారోగ్యానికి గురవుతు న్నారు. ఏటా 4,20,000 మంది మరణిస్తున్నారు. వీరిలో 1,25,000 మంది ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్నా రు. కలుషిత ఆహారం తినడం వల్ల 200కు పైగా వ్యాధులు వస్తున్నాయి. మనదేశంలో కలుషిత ఆహారం, అసురక్షిత పద్ధతులవలన, ఫుడ్ పాయిజనింగ్ వల్ల లక్షలాది మరణాలు సంభవిస్తున్నాయి. హానికరమైన బాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు లేదా రసాయన పదార్ధాలను కలిగి ఉన్న అసురక్షిత ఆహారం అతిసారం నుండి క్యాన్సర్ల వరకు అనేక వ్యాధులకు కారణమవుతుంది.

శిశువులు, చిన్నపిల్లలు, వృద్ధులు ప్రభావితమవుతున్నారు. విషపూరిత మైన, కలుషితమైన ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు లేదా రసా యన పదార్ధాలవల్ల  వ్యాధులు సంభవిస్తాయి. రసాయన కాలుష్యం తీవ్రమైన విషం లేదా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. అనేక ఆహార సంబంధిత వ్యాధులు దీర్ఘకాలిక వైకల్యం, మరణాలకు దారితీయవచ్చు. గుడ్లు, పౌల్ట్రీ, జంతు సంబంధిత పదార్థాలు, పాశ్చరైజ్ చేయని పాలు, ఉడకని మాంసం, కలుషితమైన పండ్లు, కూరగాయల వల్ల బాక్టీరియా, వైరస్‌ల వల్ల సాల్మొనెలోసిస్, లిస్టెరియా ఇన్ఫెక్షన్లు, హెపటైటిస్-ఎ, న్యూరోడిజెనరేటివ్ వంటి వ్యాధులు వస్తాయి. గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం లేదా నవజాత శిశువుల మరణానికి దారి తీయవచ్చు. కొన్ని వైరస్‌లు ఆహారం  ద్వారా వ్యాపిస్తాయి. 

ఫుడ్ సేఫ్టీ అధికారుల పాత్ర

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్‌అథారిటీ ఆఫ్ ఇండి యా దేశంలో ఆహార పదార్థాల తయారీ, నిల్వ, పంపి ణీ, విక్రయం, దిగుమతిని, ఆహార ప్రమాణాలను నిర్దేశిస్తుంది. దీని ప్రధాన లక్ష్యం ఆహారంపై శాస్త్రీయ ప్రమాణాలను నిర్దేశించడం. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఫుడ్ అనలిస్ట్ ద్వారా విశ్లేషణ కోసం నమూనాలను సేకరించడానికి వీరికి అధికారం ఉంది. పట్టణీకరణ,  విని యోగదారుల అలవాట్లలో మార్పులు బహిరంగ ప్రదేశాల్లో తయారుచేసిన ఆహారాన్ని కొనుగోలు చేసి తినే వారి సంఖ్యను పెంచాయి. గ్లోబలైజేషన్ అనేక రకాల ఆహారాల కోసం పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌ను ప్రేరేపించింది. జనం జంక్ ఫుడ్లకు, రెస్టారెంట్స్ లాంటి ప్రదేశాలలో రెడీమేడ్ ఆహారానికి, పబ్స్, పార్టీలు, విందులకు ప్రజలు అలవాటు పడ్డారు. వీటివల్ల అనారోగ్యాలు వస్తునాయి.

పరిష్కారాలు

దేశవ్యాప్తంగా సురక్షితమైన ఆహారాన్ని అందించడానికి ఆచరణాత్మక వ్యూహాలను అవలంబించాలి. వీధి వ్యాపారాల ఆహార నాణ్యతను మెరుగు పరచా లి. ఆహార వినియోగం, జీవ సంబంధమైన ప్రమాదాలు, కలుషితాలు, ఉద్భవిస్తున్న ప్రమాదాలపై డేటా ను సేకరించి, క్రోడీకరించడానికి మెకానిజంలను ఏర్పాటు చేయాలి. ఇది సమర్థవంతమైన పర్యవేక్షణకు దోహదపడుతుంది. వేగవంతమైన హెచ్చరిక వ్యవస్థను ఏర్పరచాలి. సురక్షిత ఆహారం, బలమైన ఆహార వ్యవస్థలను నిర్ధారించడంలో సహాయపడటానికి ప్రభుత్వాలు, ఉత్పత్తిదారులు, వినియోగదారుల మధ్య మంచి సహకారం అవసరం. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలుచేయాలి. అసురక్షిత ఆహారాన్ని అమ్ముతూ వ్యాపారం చేస్తున్న వారిపై ఉక్కు పాదం మోపాలి. లంచం తీసుకొని చూసీచూడనట్టు ప్రవర్తించే అధికారులపై కఠిన చర్యలు తీసు కోవాలి. ఇవి ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. ఏమరుపాటు అనేక ప్రాణాలను తీస్తుంది.

 జనక మోహన రావు దుంగ 

8247045230