23 June, 2026 | 2:47 PM

గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి

23-06-2026 01:57 PM

 షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

షాద్ నగర్ జూన్ 23 (విజయక్రాంతి): గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా మరియు విక్రయాలపై కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  అధికారులను ఆదేశించారు.కల్తీ మద్యం తయారీ, నిల్వలు, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే   యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అక్రమ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.

ఎక్సైజ్ శాఖ విధులు నిర్వర్తించే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజల భద్రత మరియు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అక్రమ మాదకద్రవ్యాలు, కల్తీ మద్యం నిర్మూలనలో ఎక్సైజ్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో  ఎక్సైజ్ సి ఐ చంద్రశేఖర్, ఎస్ ఐ శ్రీనివాస్ స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.