2 May, 2026 | 4:51 AM

సఖ్యతా? సమరమా?

07-06-2024 12:05 AM

ఆంధ్రాలో ఒక చంద్రుడు తెరపైకి రావటం.. తెలంగాణలో మరో చంద్రుడు తెరమరుగు కావటం ఒకేసారి జరిగిపోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. కానీ, ఆయన పార్టీ బీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో పార్టీ పెట్టి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత బీఆర్‌ఎస్ చరిత్రలో తొలిసారి లోక్‌సభలో స్థానం కోల్పోయింది. మరోవైపు గత ఐదేండ్లుగా వైఎస్ జగన్ చేతిలో నానా అవమానాలూ ఎదుర్కొన్న చంద్రబాబు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తారని సగమంది ఆ రాష్ట్రం వారికి నమ్మకం లేదు. కానీ, ఆయన అనూహ్యంగా ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అవుతున్నారు. కేంద్రంలో కూడా ప్రధాని మోదీకి సమానంగా గౌర వం అందుకోబోతున్నారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది తెలంగాణవాదులు ఊహిస్తున్నట్టుగానే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వచ్చే ఐదేండ్లు సంబంధాలు ఎలా ఉండాలన్నది ఇకపై చంద్రబాబు డిసైడ్ చేయబోతున్నారు. 

హైదరాబాదే మొదటి లక్ష్యం

తెలంగాణలో చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రకంటే తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉన్నది. ఆ బలంలో సగం హైదరాబాద్ నగరమే. చంద్రబాబు అధికారం చేపట్టగానే మొదట దృష్టిపెట్టేది హైదరాబాద్‌పైనే. ఆంధ్రలో ఇప్పటివరకు రాజధాని లేదు. ఆ పరిస్థితి ఆంధ్రకు చాలా నష్టమే చేసింది. గతంలో చంద్రబాబు పునాదులేసిన అమరావతి నగరానికి ఇప్పుడు ఆయన మళ్లీ ప్రాణం పోయనున్నారు. అందుకు చంద్రబాబు మొదట దృష్టి సారించేది హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రా పెట్టుబడిదారులనే. ఆంధ్రా పెట్టుబడిదారులు ఒక్క రియల్ ఎస్టేట్ రంగంలోనే లేరు. సకల రంగాల్లో వారు రాణిస్తున్నారు. వారిలో అత్యధికమందిని చంద్రబాబు అమరావతికి తీసుకుపోతారనటంలో సందేహం లేదు. వైఎస్ జగన్ పాలనలో టీడీపీ అనుకూల పెట్టుబడిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  దీంతో అమర రాజా వంటి కంపెనీలు తెలంగాణకు తరలివచ్చి భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. 

ఇప్పుడు ఇలాంటి కంపెనీలు పూర్తిగా ఆంధ్రాకు తరలిపోకపోయినా కచ్చితంగా వారి ప్రాధాన్యతలు మారుతాయి. కేవలం ఆంధ్రా పెట్టుబడిదారుల వ్యాపారాలతోనే నడిచే స్థాయిని హైదరాబాద్ దాటిపోయింది. కానీ ఇకపై హైదరాబాద్‌కు రావా లనుకొనే అంతర్జాతీయ కంపెనీలను ఢిల్లీ స్థాయిలోనే లాబీయింగ్‌తో అమరావతిలో ల్యాండ్ చేయటానికే ఎక్కువ అవకా శాలున్నాయి. గత పదేండ్లలో కేసీఆర్ సర్కారు హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఇక్కడ ఆంధ్రా పెట్టుబడిదా రులకు అడిగిందే తడవుగా భూములిచ్చింది. ఇప్పుడు ఆ పెట్టబడులను అమరా వతికి తరలించుకుపోయినా ఆ భూములు వారి చేతిలోనే ఉంటాయి. అలా వారికి రెండురకాలుగా లాభం చేకూరుతుంది.  

రేవంత్ కౌంటర్ ఇవ్వగలరా?

చంద్రబాబుకు తెలంగాణ సీఎం సన్నిహిత అనుచరుడని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈయన కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి అనుచరుడి స్థాయి నుంచి మంచి మిత్రుడి స్థాయికి ఎదిగినట్టే. కానీ, చంద్రబాబు మిత్ర ధర్మాన్ని పాటిస్తారన్న నమ్మకం లేదు. తన రాష్ట్రం కోసం, ముఖ్యంగా తన సామాజికవర్గం కోసం ఆయన ఎంతవరకైనా వెళ్తారని గతంలోనే నిరూపణ అయ్యింది. మరి ఆ గురు మిత్రుడిని రేవంత్ ఎలా ఎదుర్కొంటారన్నది ముందుముందు తెలుస్తుంది. కేంద్రప్రభుత్వ మద్దతు కూడా చంద్రబాబుకే ఉంటుంది కాబట్టి కచ్చితంగా రేవంత్‌కు వచ్చే ఐదేండ్లు అగ్ని పరీక్షే అవుతుంది. ఇప్పుడున్న తెలుగు మీడియా కూడా మొత్తం ఆంధ్రా పెత్తందారుల చేతిలోనే ఉన్నది కాబట్టి కచ్చితంగా చంద్రబాబుకే సపోర్ట్ చేస్తుంది.

నిజానికి ఈ మీడియా సంస్థలకు ఏనాడూ తెలంగాణ మీద ప్రేమ లేదు. గత పదేండ్లు తమ అవసరం కోసం తమ అసలు స్వరూపాన్ని దాచేశాయి. ఇప్పుడు అది బయటకు రానున్నది. ఈ పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డికి ఈ మీడియా దాడిని ఎదుర్కొంటూ ఉన్న పెట్టుబడులను కాపాడుకోవటం ఒక ఎత్తయితే.. కొత్త పెట్టుబడులను రాబట్టడం మరో మహా సాహసంగా మారనున్నది. ముందు కాలమంతా రేవంత్‌రెడ్డి పరిపాలనా దక్షతకు, రాజకీయ చతురతకు పరీక్షే కానున్నది. 

బీఆర్‌ఎస్‌కూ అవకాశాలు

వరుసగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయి బీఆర్‌ఎస్ ఇప్పుడు బాగా బలహీనపడినట్టు కనిపించవచ్చు. కానీ, ఆ పార్టీ పూర్తిగా శక్తులు కోల్పోలేదు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇలాంటి ఎత్తుపల్లాలు చాలానే చూశారు. కాకపోతే ఇప్పుడు ఆ పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే మరోసారి తెలంగాణ సెంటిమెంట్ అనే టానిక్ అవసరం. ఆ టానిక్‌ను రేవంత్, చంద్రబాబు స్వయంగా ఇచ్చినా ఇవ్వవచ్చు. నదీజలాల పంపకం, ఆస్తుల పంపకం విషయంలో రేవంత్ రెడ్డి ఏమాత్రం చంద్రబాబుకు తలవంచినా అది బీఆర్‌ఎస్‌కు బూస్టింగే అవుతుంది. కానీ, రాజకీయంగా రాబోయే కాలం తీవ్ర గడ్డుకాలం కూడా కావచ్చు. కేంద్రంలో ఉన్న మోదీకి, ఏపీలో ఉన్న చంద్రబాబుకు, తెలంగాణలో ఉన్న రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ ఉమ్మడి శత్రువు. దానిని పూర్తిగా నాశనం చేయాలన్నదే వారి ముగ్గురి ఉద్దేశం. మరి ఈ ముగ్గురు శక్తిమంతులను ఏక కాలంలో ఎదుర్కొని బీఆర్‌ఎస్ పార్టీ మనుగడ సాగించాలన్నా.. పూర్వవైభవం సంపాదించాలన్నా తెలంగాణ సెంటిమెంటే ఆధారం. అందుకు రేవంత్, చంద్రబాబు సందు ఇస్తారో లేదో చూడాలి. 

‘ఉద్యమకారుల’ వ్యూహం ఫలించేనా?

తెలంగాణ ఉద్యమ వ్యతిరేకిగా ముద్రపడ్డ రేవంత్‌రెడ్డి అనూహ్యంగా దక్కిన సీఎం పదవితో రాష్ట్రంలోని అన్నివర్గాలకు ఆమోదయోగ్యుడిగా అవతరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే సీఎం అయిన వెంటనే ఉద్యమకారులను చేరదీసే పనిని మొదలుపెట్టారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను తీవ్ర నిర్లక్ష్యం చేయటంతో ఇప్పటికైతే వారంతా రేవంత్‌రెడ్డి చర్యలకు సానుకూలంగానే స్పందిస్తున్నారు. దీంతో తెలంగా ణ సమాజంలో యాక్సెప్టెన్నీ సాధించేందుకు ఆయన ప్రయత్నాలు మరింత పెంచారు.

తెలంగాణ తల్లి విగ్రహం బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత ముఖాన్ని పోలి ఉన్నదన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. అందుకే రేవంత్ రాగానే ఆ విగ్రహంలో మార్పులు చేసే పనిలో పడ్డారు. రాష్ట్ర అధికారిక ముద్రలో కాకతీయ కళా తోరణం, చార్మినార్‌లను తీసేసి అమరవీరుల స్తూపాన్ని పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి ద్వారా ఉద్యమకారులకు మరింత దగ్గర కావచ్చని ఆయన భావిస్తున్నారు. కానీ, రాష్ట్ర గీతం మొదట్లోనే గండి కొట్టింది. ఆ గీతానికి ఆంధ్రా వ్యక్తితో సంగీతం ఇప్పించటం ఒకటైతే.. అది తెలంగాణ ప్రజలకు అస్సలు నచ్చకపోవటం మరో కారణం.

త్వరలో మార్పులతో రానున్న తెలంగాణ తల్లి, రాష్ట్ర చిహ్నాలపై ఎన్ని వివాదాలొస్తాయో చెప్పలేం. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని తెలంగాణ తల్లి అని రేవంత్‌రెడ్డి స్వయంగా సంబోధిస్తున్నందున విగ్రహంలో ఆమె పోలికలు ఉన్నా ఆశ్చర్యపోనవసరంలేదు. ఒకవేళ లేకపోయినా బీఆర్‌ఎస్ నేతలు వివాదం సృష్టించకుండా వదలరు. ఈ సమయంలో తెలంగాణ నీళ్లు, నిధుల కోసం చంద్రబాబుతో ఎలా వ్యహరిస్తారన్నది కూడా కీలకంగా మారనున్నది. తెలం గాణ ప్రయోజనాల విషయంలో ఏమా త్రం తేడా వచ్చి నా రేవంత్‌రెడ్డిపై ఉద్యమకారుల తిరుగుబాటు మొదలవుతుంది. అది అంతిమంగా బీఆర్‌ఎస్ మళ్లీ బలపడటానికి కారణమవుతుంది. ఈ రకంగా చూస్తే రేవంత్ పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా మారినా ఆశ్చర్యం లేదు.

వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు