సురక్షిత ప్రయాణాలే అరైవ్ అలైవ్ లక్ష్యం
రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్
జనరల్ ఆఫ్ పోలీస్ చారు సిన్హా
వరంగల్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల బారీన పడకుండా ఉండేందుకు వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించేలా అవగాహన కల్పించడమే అరైవ్ అలైవ్ కార్యక్రమం లక్ష్యమని రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సీఐడీ), ఉమెన్ సేఫ్టీ వింగ్, యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ చారు సిన్హా తెలిపారు.
గురువారం హనుమకొండ జిల్లా భీమారం పరిధిలోని కేఎల్‌ఎన్ ఫంక్షన్ హాలులో వరంగల్ పోలీస్ కమిషనరేట్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్డు భద్రతపై అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ డీజీపీ చారు సిన్హా, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీ చారు సిన్హా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తెలుసుకుని, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించడమేనని పేర్కొన్నారు.
రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సురక్షిత ప్రయాణం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్ వల్ల తమతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో తమ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులను గుర్తుంచుకుని బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు.
పాఠశాలలు, మండల విద్యాధికారులతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు ఈ సందర్భంగా బహుమతులు అందజేస్తున్నామని చెప్పారు. మెడికల్ క్యాంపులు, హ్యూమన్ చైన్లు, పాఠశాలలు, కళాశాలల్లో కార్యక్రమాల ద్వారా ప్రజల్లో బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాటు పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. చిన్నచిన్న జాగ్రత్తలతోనే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.
రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తామని కార్యక్రమానికి హాజరైన వాహనదారులు, బస్సు డ్రైవర్లు, సర్పంచులు, ప్రజలతో ప్రమాణం చేస్తూ ప్రతిజ్ఞ చేయించారు. సురక్షిత డ్రైవింగ్కు ఆదర్శంగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లా డ్రైవర్లకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేసి సత్కరించారు. జిల్లా రవాణాశాఖ అధికారి సురేష్ రెడ్డి, డిసిపిలు ధార కవిత, అంకిత్ కుమార్, వరంగల్ ఏఎస్పి శుభం, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్ర, వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎంవిఐలు వేణుగోపాల్, శోభన్ బాబు, కిషోర్ బాబు పాల్గొన్నారు.






