షీ టీం అండతో విద్యార్థినులకు భద్రత
వేధింపులు, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : సీఐ రవికుమార్
గజ్వేల్, ఆగష్టు3 (విజయ క్రాంతి) : మహిళల భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ టీం సేవలను ప్రతి విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ సీఐ రవికుమార్ సూచించారు. గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్, మహిళా సాధికారిక విభాగం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎస్. గణపతి రావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీఐ రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ మహిళలపై జరిగే వేధింపులు, సైబర్ నేరాలు, చట్టపరమైన రక్షణ, షీ టీం సేవలపై విద్యార్థినులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా వెంటనే షీ టీంను లేదా పోలీసులను సంప్రదించాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎస్. గణపతి రావు మాట్లాడుతూ విద్యార్థినుల భద్రతకు షీ టీం ఒక రక్షణ కవచంలా పనిచేస్తోందని, మహిళా భద్రతపై ప్రతి విద్యార్థికి అవగాహన అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వెంకటేష్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎం. భవాని, మహిళా సాధికారిక విభాగం అధ్యక్షురాలు డాక్టర్ టి. కవిత, అధ్యాపక బృందం పాల్గొన్నారు. విద్యార్థినులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






