పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి
జన్నారం, మార్చి 25 : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి చంద్రయ్య అన్నారు. బుధవారం మండలంలోని పొనకల్ జీపీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొనసాగుతున్న పారిశుధ్యం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని అంతర్గత రహదారులు, మురుగు కాలువ వ్యవస్థను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్లు పథకాల అమలు తీరును, నర్సరీలో మొక్కల సంరక్షణకు చర్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
ఆయన వెంట మండల తహసిల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఎంపీవో జలంధర్, గృహ నిర్మాణ శాఖ ఎఈ లయకత్ అలీ, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎఈ నందన్ వర్మ, పంచాయతీ కార్యదర్శి రాహుల్, ప్రజాప్రతినిధులు, తదితరులున్నారు.




