సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తిదాయకం
బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన పోరాటం చిరస్మరణీయం: కలెక్టర్ అనురాగ్ జయంతి
ఆలేరు,(విజయక్రాంతి): బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. పేదల కోసం ఆయన చేసిన త్యాగాలు, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమం నేటి తరానికి ఆదర్శమన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని తెలిపారు.






