18 August, 2026 | 7:02 PM

కొత్తపల్లి పట్టణంలో పార్థీనియం నిర్మూలన కార్యక్రమం

18-08-2026 06:22 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (టీఆర్ వికె), కరీంనగర్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున పార్థీనియం నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్వికె శాస్త్రవేత్త డా. పి. మధుకర్ రావు మాట్లాడుతూ పార్థీనియం పంటల దిగుబడులను ప్రభావితం చేయడమే కాకుండా, పశువులకు, మనుషులకు కూడా ఆరోగ్య సమస్యలు కలిగించే ప్రమాదం ఉందని, పార్థీనియం మొక్కలను పూతకు రాకముందే వేర్లతో సహా పీకి తొలగించడం ద్వారా దాని విత్తన వ్యాప్తిని అరికట్టవచ్చని సూచించారు. రైతులు తమ పొలాలు, పొలాల గట్లతో పాటు పరిసర ప్రాంతాలను క్రమం తప్పకుండా పరిశీలించి పార్థీనియంను ప్రారంభ దశలోనే నిర్మూలించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల వ్యవసాయధికారి కోత సంతోష్ కుమార్, ఎడిఎ తిరుమలేష్, ఏఈఓ లు ఫాజిల్, ఫరీద్, టీ ఆర్ వి కె సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.