4 March, 2026 | 4:23 PM

ఉపాధి హామీ పనుల్లో తేనెటీగల దాడి

04-03-2026 03:00 PM

ఒక వృద్ధురాలి పరిస్థితి విషమం

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో బుధవారం ఉదయం ఉపాధి హామీ పనుల్లో భాగంగా సర్వాయి కాలువ మరమ్మతు పనులు చేపట్టారు. ఈ పనుల్లో దాదాపు పది మంది కూలీలు పాల్గొనగా, కాలువలోని గడ్డి ఘంటలను తొలగిస్తున్న క్రమంలో గడ్డి పోదల్లో ఉన్న తేనెటీగలు అకస్మాత్తుగా వారిపై దాడి చేశాయి. ఒక్కసారిగా దాడి జరగడంతో భయాందోళనకు గురైన కూలీలు అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే అప్పటికే పలువురిని తేనెటీగలు తీవ్రంగా కుట్టాయి.

ఈ ఘటనను గమనించిన తోటి కూలీలు గాయపడిన వారిని వెంటనే కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. అయితే సరైన సదుపాయాలు లేకపోవడం, ప్రభుత్వ అంబులెన్స్  అందుబాటులో లేకపోవడం ద్వారా గాయపడిన వారిని కొంతమందిని ట్రాలీ ఆటోలో తరువాత వచ్చిన అంబులెన్సులో కొంతమందిని సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు.

గాయపడిన వారి వెంట సర్పంచ్ సింగం శ్రీహరి, ఉపసర్పంచ్ లంబ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్ వెళ్లి వైద్యులను కలిసి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రస్తుతం గాయపడిన వారందరికీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుండగా, వారిలో ఒక వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.