8 August, 2026 | 1:14 AM

ఎస్‌బీఐ నికర లాభం రూ.21,121 కోట్లు

08-08-2026 12:00 AM

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించిన బ్యాంక్

ముంబై, ఆగస్టు7: దేశీయంగా అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2027 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్ గతంలో ఎన్నడూ లేనంతగా రూ. 21,121 కోట్ల మేర అత్యధిక త్రైమాసిక నికర లాభాన్ని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో నిర్వహణ లాభం వార్షికంగా 9.77% పెరిగి రూ. 33,529 కోట్లకు చేరుకోగా, నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 14.88% పెరిగి రూ. 46,992 కోట్లకు చేరుకుంది.

అలాగే త్రైమాసికానికి దేశీయ నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) 3.00% గా నమోదైంది. విస్తృత స్థాయిలో అడ్వాన్సులు 18.63%గావృద్ధి చెందడం, డిపాజిట్లు 9.73% వృద్ధి చెందడంతో మొత్తం వ్యాపారం రూ. 110 లక్షల కోట్లను దాటడంతో బ్యాంక్ మరో కీలకమైన మైలురాయి ని సాధించింది. ఎస్‌బీఐ డిపాజిట్ల పరిస్థితి పటిష్టంగా, వైవిధ్యంగా ఉంది. కాసా డిపాజిట్లు వార్షికంగా 9.30% వృద్ధి చెందాయి. తీవ్రమైన పోటీ వాతావరణం ఉన్నప్పటికీ బ్యాంక్ కాసా నిష్పత్తిని ఆరోగ్యకరంగా 39.24% స్థాయి లో నిలబెట్టుకుంది.

రిటైల్ టర్మ్ డిపాజిట్లు వార్షికంగా 14.39% వృద్ధి చెందాయి. రెండు దశాబ్దాలకు పైగా అత్యల్ప స్థాయి మొండి బకాయిలతో బ్యాంక్ అసెట్స్ నా ణ్యత పరిశ్రమలోనే అత్యుత్తమైనదిగా కొనసాగుతోంది. 2030 నాటికి మా 75వ వార్షి కోత్సవం వైపు అడుగులు వేసే క్రమంలో, భవిష్యత్తుకు అనుగుణంగా ఎస్‌బీఐని తీర్చిదిద్దడంపై మేము ప్రధానంగా దృష్టి పెడుతున్నాం, అని బ్యాంక్ పనితీరు గురించి మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్  సీఎస్ శెట్టి తెలిపారు.