జీవన్‌రెడ్డి ఎన్నిక చెల్లదు: టీసీఏ
టీజీ20 లీగ్ ఫ్రాంచైజీల వేలంతో స్కామ్
సీఐడీ విచారణకు డిమాండ్
హైదరాబాద్, మే 18: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై మరోసారి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) సెక్రటరీ ధరం గురువారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హెచ్‌సీఏ సెక్రటరీగా జీవన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని చెప్పారు. డబుల్ రిజిస్ట్రేషన్ అయిన క్లబ్‌ను కొని దాని ద్వారా హెచ్‌సీఏలోకి జీవన్‌రెడ్డి అడుగుపెట్టారని ఆరోపించారు.
మోసపూరితంగా ఎన్నికైన జీవన్‌రెడ్డిపై సీఐడీకి, బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అలాగే టీజీ20 లీగ్ పేరుతో భారీ అవినీతికి తెరతీసారని టీసీఏ ఆరోపించింది. ఏజీఎం ఆమోదం లేకుండా అక్రమంగా టీజీ20 లీగ్ గవర్నింగ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారనీ, ఇప్పుడు ఈ లీగ్ ఫ్రాంచైజీల వేలంతో స్కాంకు తెరతీసారని టీసీఏ సెక్రట రీ గురువారెడ్డి మండిపడ్డారు. ఒక్కో ఫ్రాంచైజీని రూ.3 కోట్ల నుంచి 10 కోట్ల వరకూ వేలం వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసి, తద్వా రా రూ.100 కోట్లకు పైగా టర్నోవర్‌ను ఆశి స్తూ నిధులు దారిమళ్లించేందుకు ప్లాన్ చేసారని ఆరోపించారు.
టీజీ20 లీగ్‌పై సీఐడీ విచారణ కోరుతూ ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. బీసీసీఐ రాజ్యాంగానికి విరుధ్ధంగా క్రికెట్ హెడ్ అంబటి రాయుడు, సెలక్షన్ కమిటీలను నియమించారని గురువారెడ్డి తెలిపారు. కామెంటేటర్‌గా ఉన్న సుమన్‌ను సెలక్టర్‌గా నియమించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ మెన్ ఓపెన్ సెలక్షన్స్ పేరుతో 16 నుంచి 36 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారిని ఒక్కరోజులో ఎలా ఎంపిక చేసేస్తారో హెచ్‌సీఏకే తెలియాలంటూ ఎద్దేవా చేశారు. వెంటనే బీసీసీఐ హెచ్‌సీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.






