10 July, 2026 | 2:43 AM

బడిపిల్లల భద్రతపై పట్టింపేదీ?

10-07-2026 01:42 AM

ప్రమాదకరంగా ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం

పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు

కల్వకుర్తి జులై 09: గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులను తీసుకువచ్చే వాహనాల్లో సామర్థ్యానికి మించి పిల్లలను తరలిస్తున్నారు. నలుగురు నుంచి పది మంది మాత్రమే ప్రయాణించాల్సిన ఆటోలు, వ్యాన్లు, ఇతర వాహనాల్లో 20 నుంచి 25 మంది వరకు విద్యార్థులను కుక్కి తీసుకెళ్తున్నారు. దీంతో చిన్నపాటి ప్రమాదం జరిగినా భారీ ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉంది.

వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల భద్రతను మాత్రం పూర్తిగా విస్మరిస్తున్నాయి. స్వంత బస్సులు సరిపడా నడపకుండా ప్రైవేటు ఆటోలు, వ్యాన్లపై ఆధారపడుతున్నాయి. అనేక వాహనాలు కాలం చెల్లినవిగా ఉండటంతో పాటు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, బీమా, అనుమతి పత్రాలు లేకుండానే రోడ్డుపై తిరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అనుభవం లేని డ్రైవర్లతో  విద్యార్థులను రవాణా చేయిస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి.

నామమాత్రంగానే వాహనాల పరీక్షలు..

నిబంధనల ప్రకారం ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠశాల వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి అనుమతులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, కొందరు యజమానులు సంబంధిత అధికారులను మభ్యపెట్టి తనిఖీలు లేకుండానే వాహనాలను తిప్పుతున్నారు. అనేక పాఠశాలల బస్సులు కాలం చెల్లినవే కావడం విశేషం తక్కువ ధరకు కొనుగోలు చేసి రంగులు వేసి పైపై మెరుగులు దిద్దుతూ విద్యార్థులను చేరవేస్తున్నారు.

రవాణా శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఎక్కడ పరిశీలించకుండానే తమ కార్యాలయాన్ని వద్దకు వచ్చిన వాహనాలకు స్టిక్కర్కు వేసి నామ్ అవసరమైన పరీక్షలు చేసి పంపుతున్నారు.  ఉదయం 9 గంటలకు పాఠశాలలు ప్రారంభమైనా, అధిక ట్రిప్పులు వెళ్లేందుకు ఉదయం 6 గంటల నుంచే విద్యార్థులను తరలించడం ప్రారంభిస్తున్నారు. దీంతో విద్యార్థులు శారీరకంగా మానసికంగా దెబ్బతింటున్నారని కలుగు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

పిల్లల భద్రత విషయంలో రాజీ పడకుండా, నిబంధనలు పాటించే వాహనాల్లోనే వారిని పంపేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికైనా రవాణా, విద్య, పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థుల రవాణాలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది.