దొంగలు బాబోయ్.. దొంగలు
- జిల్లాలో పెరుగుతున్న చోరీలు
- పోలీసులకు సవాల్
- భయాందోళనలో ప్రజలు
సిద్దిపేట క్రైం, జూలై 9: సిద్దిపేట జిల్లాలో రోజురోజుకు దొంగతనాలు తీవ్రమవుతున్నాయి. ఒక చోరీ ఘటన మరువకముందే మరోచోట జరుగుతుండడం గమనార్హం. తాళం వేసిన ఇళ్లు, ఆలయాలు, దుకాణాలు, వాహనాలు... ’కాదేది దొంగతనానికి అనర్హం’ అన్నట్టుగా దుండగులు వ్యవహరిస్తున్న తీరు పోలీసులకు సవాల్ విసురుతోంది.
సిద్దిపేట జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. ’సిద్దిపేట సురక్ష నేత్ర‘ పేరిట జిల్లావ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు కూడా ఇళ్ల వద్ద వాటిని బిగించుకోవాలని సూచిస్తున్నారు. అయినా జిల్లాలో రెండు మూడు రోజులకు ఏదో ఒక ప్రాంతంలో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి దుబ్బాక పట్టణంలో తీర్థయాత్రలకని ఇంటికి తాళం వేసి వెళ్లిన ఓ మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.
ఈ ఘటన మరువకముందే గురువారం అర్ధరాత్రి హుస్నాబాద్ పట్టణంలోని మార్కండేయ స్వామి, అభయ వీరాంజనేయ స్వామి ఆలయాల్లో హుండీలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి, అందులో నగదు, కానుకలను అపహరించారు. అదేరోజు కొండపాక మండలం దుద్దెడ శివారులోని ఓ వైన్ షాపు మూసివేశాక అర్ధరాత్రి దొంగలు చొరబడి రూ.25వేల నగదు, ఖరీదైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఆయా సంఘటనల్లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాల్లో క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వరుస దొంగతనాలతో జిల్లావాసులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు గస్తీ ముమ్మరం చేసి, చోరీలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.






