మూడవ తరగతి విద్యార్థిపై స్కూల్ టీచర్ దాష్టీకం
చందుర్తి,(విజయక్రాంతి): మండలంలోని సనుగుల గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడి నిర్వాకం దారుణంగా ఉంది. చిన్న చిన్న విషయాలకు కూడా విద్యార్థులను చితక బాధడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే సనుగుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కోరెపు శ్రీనివాస్ ఎన్విరాన్మెంట్ సైన్స్ (EVS ) బోదించే ఉపాధ్యాయుడు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్ధి ముచ్చర్ల కుమార్ ను కర్రతో అమానుషంగా చితకబాదాడు. ఉదయం రాగిజావ కోసం మెట్లపై కూర్చున్న కుమార్ ను శ్రీనివాస్ అనే టీచర్ వీపు పైన, ఎడమచేతు పైన కర్రతో కొట్టడంతో ఎడమ చేతి మోచేతి క్రింది భాగంలో విరిగినట్లు విద్యార్థి తల్లిదండ్రులు ఎల్లవ్వ,రాజయ్య తెలిపారు.
ఆసుపత్రిలో చికిత్స చేయించిన తల్లిదండ్రులు కొడుకును ఇంతలా చితకబాదడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న విషయాల్లో కూడా ఉపాధ్యాయులు కర్కశంగా ప్రవర్తించడంతో ఒక టీచర్ చిన్న పిల్లలను ఇలా కొట్టడం ఏంటి అని సనుగుల గ్రామంలో చర్చనీయంశంగా మారింది. ఈ విషయమై ప్రధాన ఉపాధ్యాయుడు ముఖేష్ ను వివరణ కోరగా శనివారం రోజున విద్యార్ధి అల్లరి చేయడంతో, శ్రీనివాస్ టీచర్ మందలించగా కర్రతో అరచేతిపై కొడుతున్న సమయంలో చేయి అడ్డుపెట్టడంతో ఎడమ చేతికి చిన్న గాయం అయిందని తెలిపారు. శ్రీనివాస్ టీచర్ పై ప్రధాన ఉపాధ్యాయులు చర్యలు తీసుకున్నామని ఇలాంటి చర్యలు సహించేది లేదని తెలిపారు.






