21 July, 2026 | 9:00 PM

మహిళా సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

21-07-2026 05:28 PM

11 గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలకు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే  నర్సారెడ్డి

గజ్వేల్: మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతోందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి అన్నారు. మంగళవారం ములుగు మండలంలోని బండ నర్సంపల్లి, చిలసాగర్, మామిడ్యాల, ఆర్‌అండ్‌ఆర్ కాలనీ మామిడాల, తనేధార్‌పల్లి, బైలాంపూర్, అచ్చాయిపల్లి, తునికిబొల్లారం గ్రామాల్లో నూతన మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి , మామిడాల ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో రూ. 5 లక్షలతో మురికి కాలువ నిర్మాణ పనులను నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల సంక్షేమానికే పెద్దపీట వేస్తుందని, ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో మహిళా సంఘాలకు సొంత భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం లభిస్తోందని, గృహం లేని నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల మంజూరుతో పాటు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు. మహిళలు సంఘాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు.