11 August, 2026 | 6:36 PM

పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్ వెనక్కి పంపడం దుర్మార్గం: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

11-08-2026 05:37 PM

మహబూబ్‌నగర్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడం దుర్మార్గమని మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం మరోసారి బట్టబయలైందని ఆయన విమర్శించారు. రెండు జాతీయ పార్టీలు పాలమూరు జిల్లాకు అన్యాయం చేయడమే పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన 16 మంది ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక్కరు కూడా మాట్లాడటం లేదని విమర్శించారు.

తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా ఎంపీలు స్పందించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఆంధ్రప్రదేశ్‌కు దోచిపెడుతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబు ఎజెండాను అమలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం తన సొంత జిల్లా ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని అన్నారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయని, ఒకటి రెండు మినహా అన్ని రకాల అనుమతులు సాధించామని లక్ష్మారెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే డీపీఆర్‌ను ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు.