11 August, 2026 | 7:08 PM

ఆగస్టు 15న వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేయాలి

11-08-2026 06:32 PM

బోధన్,(విజయక్రాంతి): ఆగస్టు 15న ప్రభుత్వం కొత్తగా మంజూరు చేయనున్న చేయూత పెన్షన్లలో వైకల్య ధ్రువీకరణ పత్రాలు పొందిన అర్హులైన వికలాంగులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని ఎన్,పి,ఆర్, ఎస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఏ. రమేష్ బాబు డిమాండ్ చేశారు. బోధన్ రాకాసిపేటలో జరిగిన  ఎన్,పి,ఆర్,ఎస్,  నిజామాబాద్ జిల్లా విస్తృత సమావేశంలో వారు మాట్లాడుతూ... వికలాంగుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ఆరోపించారు.

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అర్హులను పరిగణనలోకి తీసుకోకుండా మళ్లీ దరఖాస్తులు స్వీకరించడం సరికాదన్నారు. ఆదాయ పరిమితి లేకుండా అర్హులైన వికలాంగులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

సెప్టెంబర్ 1 నుంచి బోధన్‌లో రాష్ట్ర సదస్సు

వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలపై సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు బోధన్‌లో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. సమావేశంలో ఎన్,పి,ఆర్,ఎస్, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.