దేశ ఆర్థిక భద్రతకే సప్త సూత్రాలు
బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): దేశ వృద్ధి రేటు దెబ్బతినకుండా, భవిష్యత్ ఆర్థిక సవాళ్లను ముందుగానే ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ సప్త సూత్రాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. ఇది రాజకీయాల కోసం కాదు, దేశ ఆర్థిక భద్రత కోసం చేసిన సూచనలని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయ న విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, గల్ఫ్ ప్రాంత పరిస్థితులు వంటి అంతర్జాతీయ పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభా వం చూపుతున్నాయన్నారు. ఈ నేపథ్యం లో మన ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అందులో భాగం గానే సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు సూచించారని గుర్తు చేశారు. ఏటా దాదాపు 800 టన్నుల బంగారం దిగుమతి అవుతోందని, దీని విలువ సుమారు రూ.5.5 లక్షల కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్ల వరకు ఉంటుందని, ఇందులో 95 శాతం వ్యక్తిగత వినియోగానికే ఉపయోగపడుతోందని, దీని వల్ల రూ. 5-6 లక్షల కోట్ల విలువ విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందన్నారు.
పెట్రోల్, డీజిల్‌పై 20 శాతం వాడకం తగ్గినా మనకు రూ.3- 4 లక్షల కోట్ల పొదుపు అవుతుందన్నారు. కనీసం 25 శాతం వర్క్ ఫ్రం హోమ్ చేసినా రూ.12,000 కోట్ల విదేశీ కరెన్సీ మిగులుతుందని తెలిపారు. ఏటా లక్షల కోట్ల విలువైన వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నామని, ఇందులో 20 శాతం తగ్గించినా రూ.40,000 కోట్ల వరకు ఆదా అవుతుందని వివరించారు. ప్రతి సంవత్సరం దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువ చసే ఎరువులు దిగుమతి చేసుకుంటున్నామని, అందులో 20 శాతం ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువులు వాడి తే భూమికి లాభంతో పాటు ఖర్చు కూ డా తగ్గుతుందన్నారు.
అదే విధంగా స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలన్న ప్రధాని పిలుపు వెనుక స్పష్టమైన ఆర్థిక దృష్టి ఉందన్నారు. దేశ నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ముందుగా ఈ సప్త సూత్రాలను పాటిస్తే ప్రజలు కూడా అనుసరిస్తారని కోరారు.






