21 June, 2026 | 7:04 PM

అమెనియా లీకై ఏడుగురు మహిళలు మృతి

21-06-2026 05:51 PM

తమిళనాడు: అమ్మోనియా వాయువు లీకై ఏడుగురు మహిళలు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని పెరియపాళయం సమీపంలో కన్నిగైపైర్ వద్ద ఉన్న సెయింట్ పీటర్స్ పాల్ సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో అమ్మోనియా వాయువు లీక్ కావడంతో ఏడుగురు వలస కార్మికులు మరణించగా, 40 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్సాం, ఒడిశా, జార్ఖండ్‌లకు చెందిన సుమారు 120 మంది వలస కార్మికులు ఈ కర్మాగారం ఆవరణలోనే బస చేస్తున్నారు. కంపెనీ వారికి అక్కడే వసతి కల్పించింది. 

ఆదివారం ఆ యూనిట్‌కు వారపు సెలవు దినం కావడంతో, ఆవరణలో గ్యాస్ వ్యాపించిన సమయంలో చాలా మంది కార్మికులు తమ నివాస గదుల్లోనే ఉన్నారు. సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నుండి అమ్మోనియా లీక్ అయి క్యాంపస్‌లోని నివాస ప్రాంతంపై ప్రభావం చూపింది. చాలా మంది కార్మికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, మరికొందరికి నోరు, ముక్కు నుండి రక్తస్రావం జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే 67 మంది కార్మికులను స్థానిక వైద్య కేంద్రాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఎస్.కవిత ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుల్లో 46 మందిని వెల్స్ ఆసుపత్రిలోనూ, 21 మందిని వెంకటేశ్వర ఆసుపత్రిలోనూ చేర్పించారు.

తీవ్ర అస్వస్థతకు గురైన తొమ్మిది మందిని, మెరుగైన చికిత్స కోసం ఆ తర్వాత 108 అంబులెన్స్‌ల ద్వారా చెన్నైలోని ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. 43 మంది యువతులు, ఒక పురుషుడితో సహా సుమారు 44 మంది రోగులను సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. 15 నుంచి 16 మంది రోగులకు ఇంట్యూబేషన్ చేశారని, 11 మంది వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నారని వైద్యులు చెప్పారు. వాయువు లీకైన తర్వాతే ఏడుగురు కార్మికులు మరణించారని, మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. పెరియాపాళయం పోలీస్ స్టేషన్, అగ్నిమాపక మరియు రక్షణ సేవల విభాగం, రెవెన్యూ శాఖ, ఆరోగ్య శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.