21 June, 2026 | 7:59 PM

ఫిర్యాదులపై పారదర్శంగా విచారణ చేయాలి

21-06-2026 06:47 PM

- బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్

బెల్లంపల్లి,(విజయక్రాంతి): పోలీస్ అధికారులు ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ నిర్వహించి, బాధితులకు నమ్మకం, భరోసా కల్పిస్తూ అండగా నిలవాలని బెల్లంపల్లి ఏసిపి కిరణ్ కుమార్ తెలిపారు. ఆదివారం తాండూర్ సర్కిల్ పరిధిలోని మాదారం పోలీస్ స్టేషన్‌ను ఏసీపీ సందర్శించారు. స్టేషన్‌కు చేరుకున్న ఆయన పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం రిసెప్షన్, ఐటీ విభాగం సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పనితీరును సమీక్షించి,వారి విధుల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు.

స్టేషన్ హౌస్ అధికారి ఎస్‌ఐ సౌజన్య వద్ద నిర్వహిస్తున్న స్టేషన్ రికార్డులు,పెండింగ్ కేసుల వివరాలు, ఇతర రికార్డులను పరిశీలించారు. అలాగే స్టేషన్ నిర్వహణ తీరును సమీక్షించి, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏసిపి కిరణ్ కుమార్ మాట్లాడుతూ,పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు.స్టేషన్‌కు వచ్చే బాధితులు  ప్రజలకు ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు.

ప్రతి కానిస్టేబుల్ తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి,ప్రజలతో మమేకం కావాలన్నారు. విధుల్లో ఉన్న సమయంలో తప్పనిసరిగా లాఠీ వెంట ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ,ఎలాంటి పెండింగ్ లేకుండా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. ఆయన వెంట తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య తోపాటు పోలీసు సిబ్బంది ఉన్నారు.