21 June, 2026 | 7:55 PM

ఉద్యమకారుల ఆధ్వర్యంలో జయశంకర్ కు ఘననివాళి

21-06-2026 06:55 PM

పాల్వంచ, (విజయక్రాంతి): ప్రొఫేసర్ జయశంకర్ తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టి, వివాహాన్ని మానుకొన్న మహోన్నత ఉద్యమకారుడని పాల్వంచ ఉద్యమకారుల కొనియాడారు. ఆదివారం జయశంకర్ వర్ధంతిని పాల్వంచ ఉద్యమకారుల ఆధ్వర్యంలో దమ్మపేట సెంటర్లో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ జయశంకర్ తన అనుభవాన్ని క్రోడీకరించి, తెలంగాణాకు ఆంధ్రా, మద్రాస్ ఉద్యోగుల వలన జరుగుతున్న అన్యాయాన్ని విద్యావంతులకు తెలియజెప్పి ఉద్యమకారులుగా తయారుచేసారని గుర్తుచేసారు.

1919 లో నిజాం నవాబులు తీసుకవచ్చిన ముల్కీ నిబంధనలను ఆధారంగా చేసుకొని స్ధానికేతర ఉద్యోగులు వెళ్లిపోవాలని ఉద్యమం చేసారన్నారు. ఆనాడు 1952 లో జరిగిన ఇడ్లీ- సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో ఎనిమది మంది ఉద్యమకారులు అమరులు కాగా ఈయన ఒక్కరే మిగలడం విశేషమన్నారు.ఈ ఉద్యమ స్ఫూర్తి ని ప్రజల్లో రగిలించి మా ఉద్యోగాలు మాకే కావాలని నినదించి 1969 ఉద్యమానికి జీవం పోసారు. ఈ ఉద్యమాన్ని ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి, హాంమంత్రి జలగం వెంగళరావు లు ఉద్యమాన్ని అణచివేయుటకు జరిపిన పోలీసుల కాల్పుల్లో 369 మంది విద్యార్థులు అమరులయ్యారన్నారు.

ఆనాటి ఉద్యమాన్ని చల్లాబర్చుటకు మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి ని చేసారన్నారు, ఐనా తెలంగాణా నిరుద్యోగుల ఆశయాలు నెరవేరలేదని వెల్లడించారు. కాలం గడుస్తున్నా కొద్ది ఆంధ్రులు నీళ్లు, నిధులను, నియామాకాలను తరలించపోయి అనుభవించుట వలన కలత చెందిన తెలంగాణా వాదులు తిరిగి 1996 నుంచి ప్రజలల్లో జరుగుతున్న అన్యాయాలను తెలియచేసి 2001 నుంచి 2011 వరకు సకల జనులు కలసి తిరుగులేని ఉద్యమం  నడపగా, 1200 తెలంగాణా ఉద్యమకారులు అమరలు అవగా కాంగ్రెస్ ప్రభుత్వం 02.06.2014 న తెలంగాణా రాష్ట్రం ప్రకటించిందని గుర్తుచేసారు. నేడు 100% నిధులు, నీళ్లు,నియాకాలను కాంట్రాక్టు పనులను తెలంగాణా నిరుద్యోగులకే ఇవ్వాలని కోరారు. అలా జరగని పక్షంలో తెలంగాణా సామాజిక ఉద్యమాన్ని కొనసాగించి, మా హక్కలను సాధించుకుంటామన్నారు. ఈ నాటి ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసారు.