జలవిద్యుత్ సొరంగంలోకి భారీగా వరద.. ఏడుగురు మృతి
చమోలీ: ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ(Chamoli Tunnel Accident) జిల్లాలోని ఒక జలవిద్యుత్ ప్రాజెక్ట్(Hydropower project) వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగంలోకి నీరు ఒక్కసారిగా దూసుకురావడంతో ఏడుగురు కార్మికులు మరణించారని అధికారులు శుక్రవారం తెలిపారు. గల్లంతైన ముగ్గురి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. మాయాపూర్ (Pipalkoti) వద్ద ఉన్న ఒక సొరంగంలో ఈ ఘటన జరిగింది. కొండచరియలు విరిగిపడటం, భూమి కుంగిపోవడం వల్ల సొరంగంలో సగం భాగం శిథిలాలు, నీటితో నిండిపోవడంతో కార్మికులు అందులో చిక్కుకుపోయారు. గురువారం నాడు ఈ ఘటన జరిగినప్పుడు సొరంగంలో 22 మంది ఉన్నారని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి ఎన్.కె. జోషి తెలిపారు. వారిలో 19 మందిని రాత్రికి రాత్రే రక్షించగా, ఏడుగురు మరణించారని, గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు.
అధికారుల ప్రకటన ప్రకారం, మరణించిన వారిని తెహ్రీకి చెందిన ప్రదీప్ సింగ్ పవార్, చమోలీకి చెందిన ముఖేష్, బీహార్‌కు చెందిన దుర్లభ్ శర్మ, జార్ఖండ్‌కు చెందిన విజయ్, జితేంద్ర కుమార్, అలాగే లోకేశ్వర్, భునేశ్వర్‌లుగా గుర్తించారు. వీరిలో లోకేశ్వర్, భునేశ్వర్‌ల స్వస్థలం వివరాలు ఇంకా తెలియరాలేదు. గాయపడిన వారిని గోపేశ్వర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికీ నీటితో నిండి ఉన్న ఆ సొరంగంలోకి ఆరుగురు సహాయక సిబ్బంది ప్రవేశించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి(Chief Minister Pushkar Singh Dhami) హెలికాప్టర్‌లో పిపల్‌కోటికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఉన్న జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ కుమార్, గల్లంతైన వారి ఆచూకీ కనుగొనడానికి అవసరమైన అన్ని వనరులను సమీకరించాలని సీఎం అధికారులను ఆదేశించారు.






