14 August, 2026 | 2:53 PM

మంథని ప్రజలకు మెరుగైన వైద్యం

14-08-2026 01:46 PM

మంత్రి శ్రీధర్ బాబు చొరవకు మరో నిదర్శనం

ప్రభుత్వ ఆసుపత్రిలో మరో వైద్యునియామకం

మంథని, ఆగస్ట్14 విజయక్రాంతి: మంథని ఏరియా ఆసుపత్రిని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేస్తున్న కృషి ఫలిస్తోంది. మంత్రి ప్రత్యేక చొరవతో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ద్వారా మంథని ఏరియా ఆసుపత్రికి నూతనంగా నియమితులైన ప్రభుత్వ జనరల్ సర్జన్ డాక్టర్ నికీల్ తేజ గురువారం విధుల్లో చేరారు.

డాక్టర్ నికీల్ తేజ చేరికతో మంథని ప్రాంత ప్రజలకు శస్త్రచికిత్స వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టీవీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మంథని పట్టణంతో పాటు పరిసర మండలాల ప్రజలు తరచుగా ఎదుర్కొనే పలు శస్త్రచికిత్స సంబంధిత సమస్యలకు ఇకపై మంథని ఏరియా ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

అపెండిసైటిస్, పిత్తాశయంలో రాళ్లు, పిత్తాశయం వాపు, వివిధ రకాల హెర్నియాలు, పైల్స్, ఫిషర్, ఫిస్టులా, అబ్సెస్, హైడ్రోసీల్, రొమ్ములో గడ్డలు, లైపోమా, చర్మం కింద గడ్డలు, డయాబెటిక్ ఫుట్ పుండ్లు, పేగుల అడ్డంకి, పేగుకు రంధ్రం పడటం వంటి సమస్యలకు అవసరమైన శస్త్రచికిత్సలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు సైతం ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

పేదలకు అండగా ఉచిత వైద్యం

ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా మంథని ఏరియా ఆసుపత్రిలోనే శస్త్రచికిత్సలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందిస్తున్నామని సూపరింటెండెంట్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మంథని ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తించి వైద్యులు, సౌకర్యాలను వరుసగా అందుబాటులోకి తీసుకువస్తున్న మంత్రి శ్రీధర్ బాబు కృషి అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. ఆసుపత్రిలో వైద్య సంబంధిత సమస్యలు ఉన్నవారు సూపరింటెండెంట్‌ను 9885808589 నంబర్‌లో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.