13 April, 2026 | 5:54 AM

నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి

28-08-2024 01:31 AM
  1. నీళ్లలో మత్తు మందు కలిపి ఆటోడ్రైవర్ అఘాయిత్యం 
  2. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఘటన

ముంబై, ఆగస్టు 27: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై లైంగికదాడి, హత్య ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తున్నది. ఈ ఘటనపై ఇప్పటికీ దేశవ్యాప్తం గా నిరసనలు కొనసాగుతున్నాయి. అది మరువక ముందే ఓ ఆటోడ్రైవర్ నర్సింగ్ విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో వెలుగుచూసింది. రత్నగిరికి చెందిన 20 ఏళ్ల యువతి నర్సింగ్ చదువుతున్నది. రోజూవారీగా సోమవారం కాలేజీకి వెళ్లిన విద్యార్థిని సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కగా అప్పటికే ఆటోడ్రైవర్ మద్యం తాగి ఉన్నాడు. యువతిని మాటల్లో పెట్టి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. నీళ్లలో మత్తు మందు కలిపి ఆమెకు బలవంతంగా తాగించాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది.

తర్వాత విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడిన డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాసేపైన తర్వాత స్థానికులు తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి ఉన్న విద్యార్థినిని చూశారు. వెంటనే ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. ఆటోడ్రైవర్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు లైంగిక దాడి ఘటనపై రత్నగిరిలోని ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యు లు, నర్సులు, నర్సింగ్, మెడికల్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు రోడ్లపైకి వచ్చి అర్ధరాత్రి వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులు నిందితు డిని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.