16 July, 2026 | 8:04 PM

వెలిగిపోతున్న చాందిని!

12-06-2024 12:15 AM

ఈ ఏడాది ఇప్పటికే ‘గామి’ చిత్రం ద్వారా థియేటర్లలోకి వచ్చింది తెలుగు కథానాయిక చాందని చౌదరి. కాగా ఆమె నటించిన మరో రెండు సినిమాలు ఇప్పుడు ఒకే రోజు విడుదల కానుండటం గమనార్హం. చాందిని నటించిన ‘యేవమ్’, ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ చిత్రాలు ఈ నెల 14 తెరమీదికి రానున్నాయి. ఈ రోజుల్లో కథనాయికలు ఒక ఏడాదిలో మూడు సినిమాలు చేయడం.. అందునా తెలుగమ్మాయి కావడం విశేషమనే చెప్పాలి. ‘యేవమ్’ చిత్రంలో పోలీసు అధికారిగా కనపడనున్న చాందినీ, ‘మ్యూజిక్ షాప్ మూర్తి’లో మూర్తి పాత్రలో నటించిన అజయ్ ఘోష్‌కు సంగీత పాఠాలు నేర్పనుంది.

వీటితో పాటు నందమూరి బాలకృష్ణ 109వ చిత్రంలోనూ అవకాశం అందుకున్న ఈ తెలుగు కథానాయిక, ఈ చిత్రంలో పూర్తి స్థాయి పాత్రలో నటించనున్నట్టు సమాచారం. శక్తివంతమైన యువతిగా చాందిని చేస్తున్న ఈ పాత్ర సినిమాలో కీలకం కానుందిట. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సైతం ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో ఈ సంవత్సరం చాందిని నటించిన నటించిన నాలుగు చిత్రాలు విడుదలైనట్టు లెక్క. పదేళ్ళకు పైగా సాగిన ఆమె కెరీర్‌కి సందీప్ రాజ్ తెరకెక్కించిన ‘కలర్ ఫోటో’ చిత్రం కొత్త రంగులు అద్దింది. ఫలితంగా ఆమె కెరీర్ ఇప్పడు బాగా వెలిగిపోతోంది.