13-12-2025 12:00:00 AM
సినిమాల్లో స్థిరపడే యువతకు గొప్ప వేదిక
టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి
షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
ఈ నెల 19, 20, 21 తేదీల్లో వేడుకలు
తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ (హెచ్‌ఐఎస్‌ఎఫ్‌ఎఫ్) సమయం ఆసన్నమవుతోంది. ఈ వేడుక డిసెంబర్ 19, 20, 21 తేదీల్లో జరగనుంది. ఇందులో భాగంగా ఈ వేడుకకు సంబంధించి కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని టూరిజం ప్లాజాలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి, ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక ఆవిష్కరించారు.
అనంతరం టూరిజం భవనంపై ప్రచార బెలూన్లను ఎగురవేశారు. 700లకుపైగా దేశాల నుంచి వచ్చిన సినిమాల ప్రోమోను ప్రదర్శించారు. అనంతరం టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు యూరప్, అమెరికా వంటి దేశాల నుంచి సినిమాలు వచ్చాయని చెప్పారు. నూతనంగా ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చే యువతకు ఇది గొప్ప వేదిక అవుతుందని ఆమె అన్నారు.
అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్ ఖ్యాతిని పెంచేలా నిర్వహిస్తామని చెప్పారు. ఎఫ్‌డీసీ ఎండీ ప్రియాంక మాట్లాడుతూ.. ఈ చిత్రోత్సవాన్ని నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ బృందాన్ని అభినందించారు. ప్రసాద్స్ ఐమాక్స్‌లో ఈ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రదర్శనకు అధి కారికంగా ఎంపికైన 60 మంది నిర్మాతలకు ఆమె ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ అధినేత, ‘అంకురం’ దర్శకుడు ఉమామహేశ్వర్‌రావు మాట్లాడుతూ మూడు రోజుల షార్ట్ ఫిలిం ఫెస్టివల్ తర్వాత కూడా సినిమాలు పంపిన యువతతో, చూసిన యువతతో ఒక అవగాహన సదస్సు నిర్వహిచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ డైరెక్టర్ కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.