పర్మినెంట్ చేయాలి
బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఒరియెంట్ సిమెంట్/అదాని సిమెంట్ దేవాపూర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న లోడింగ్ కార్మికుల ఉద్యోగ భద్రత శాశ్వత ఉద్యోగ హక్కుల పరిరక్షణ కోసం ఒక్కటవుతున్నారు. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇచ్చారు. కొక్కిరాల సత్యపాల్ రావు నాయకత్వంలో పని చేస్తున్న గుర్తింపు యూనియన్ ఒరియెంట్ సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (రిజి. నెం. E 2131) ఆధ్వర్యంలో లోడింగ్, యూనియన్ నాయకులు యాజమాన్యానికి కార్మిక శాఖ అధికారులకు వినతిపత్రo అందజేశారు.
ఈ సందర్భంగా లోడింగ్, యూనియన్ నాయకులు మాట్లాడుతూ, లోడింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు అనేక సంవత్సరాలుగా సంస్థకు కీలకమైన నిరంతర సేవలను అందిస్తున్నారన్నారు. ఇప్పటికీ కాంట్రాక్ట్ కార్మికులుగానే కొనసాగుతున్నారని తెలిపారు. ఇది కార్మిక చట్టాల ఆత్మకు విరుద్ధమని పేర్కొన్నారు. అందువల్ల, OSHWC Code 2020 మరియు Contract Labour (Regulation and Abolition) Act, 1970 ప్రకారం ఈ పనిని Perennial Workగా గుర్తించి, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి, సంబంధిత కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంక్షేమం కోసం యూనియన్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.






