ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలపై డీఈఓకు వినతి
15-05-2026 | 06:43pm
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సమగ్ర శిక్ష అభియాన్ (SSA) ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగుల సంఘం నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారి లలితకు వినతిపత్రం సమర్పించారు. శుక్రవారం డీఈఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఆమెను కలిసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అనంతరం పూల బొకే, శాలువాతో డీఈఓను సన్మానించారు. ఉద్యోగుల జీతాల పెంపు, ప్రతి నెల జీతాల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యం, సమాచార లోపం కారణంగా రిపోర్టుల సమర్పణలో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలను వివరించారు. దీనిపై డీఈఓ లలిత సానుకూలంగా స్పందిస్తూ డీఈఓ స్థాయిలో పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిశీలిస్తామని తెలిపారు. ఉద్యోగులకు ఏ సమస్య ఉన్నా నేరుగా తెలియజేయాలని సూచించారు.






