15 July, 2026 | 12:09 AM

23న ఢిల్లీలో మౌనదీక్ష

15-07-2026 12:04 AM
  1. ఓటు, సీటు, ఇప్పుడు ఆలయంలో చోరీ
  2. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వ సలహాదారు వీహెచ్

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): అయోధ్యలో చోరీలు జరుగుతుంటే చిన జీయర్ స్వామితో పాటు మిగతా స్వాములు ఎందుకు మాట్లాడడం లేదని ప్రభుత్వ సలహాదారు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ప్రశ్నించారు. మొన్నటి వరకు ఓట్ చోరీ, సీట్ చోరీ జరిగిందని, ఇప్పుడు ఏకంగా రాముడి ఆలయంలోనే చోరీ జరిగిందని ఆయన మండిపడ్డారు. మంగళవారం  గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.

ఆలయంలో జరిగిన చోరీకి నిరసనగా తాను కరీంనగర్, భద్రాచలంలలో మౌన దీక్ష చేశానని, ఈ నెల 23న ఢిల్లీలో మౌన దీక్ష చేయనున్న ట్లు చెప్పారు. దీక్షకు ఏఐసీసీ నేతలను కూడా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అయోధ్యలో జరిగిన బంగారం, విరాళాల చోరీలో సీబీఐ విచారణ ఎందుకు జరగడం లేదన్నారు. అయోధ్యలో ఇంత ఘోరం జరుగుతుంటే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

ఉత్తరప్రదేశ్  ప్రభుత్వం చేపట్టిన సిట్  విచారణను నమ్మడానికి లేదని, సీబీఐ విచారణ జరిపి దోషులను శిక్షించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ఖర్గే, అశోక్ గెహ్లాట్‌లు ఈ విషయంలో మాట్లాడారని చెప్పారు. తిరుపతిలో ప్రతిరోజు నగదు, బంగారం లెక్కలు బయటకు చెబుతారని, తిరుపతి లడ్డులో నెయ్యిలో అవినీతి జరిగిందంటే విచారణ జరుగుతుందని వీహెచ్ వివరించారు.