వెండి మరో కొత్త రికార్డు
హైదరాబాద్, మే 29: అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల ధోరణి కారణంగా వెండి, బంగారాలు రెండూ వరుసగా మూడో రోజూ పెరిగాయి. ఈ దఫా పెరుగుదలలో బంగారాన్ని మించి వెండి పెరుగుతున్నది. బుధవారం హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో కేజీ వెండి ధర మరో రూ.1,200 పెరిగి రూ.1,02,200 కొత్త రికార్డుస్థాయిని నెలకొల్పింది. సోమ, మంగళవారాల్లో ఈ తెల్ల లోహం ధర రూ.5,000 పెరిగింది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.270 అధికమై రూ.73,270 వద్ద నిలిచింది. 10 రోజుల క్రితం పసిడి రూ.75,160 స్థాయికి చేరి కొత్త రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. అప్పటి రికార్డుస్థాయిని ఈ బుధవారం వెండి అధిగమించగా, బంగారం ధర రూ.1,900 వరకూ తగ్గే ఉన్నది. తాజాగా 22 క్యారట్ల పుత్తడి తులం ధర మరో రూ.200 పెరిగి రూ.67,100 స్థాయికి చేరింది.
రూపాయి ఎఫెక్ట్
ప్రపంచ మార్కెట్లో బుధవారం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, రూపాయి విలువ గణనీయంగా తగ్గినందున ఈ రెండు లోహాల ధరలు స్థానికంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో వెండి వెండి ఔన్సు ధర 32.30 డాలర్ల వద్ద, పుత్తడి ఔన్సు ధర 2,350 డాలర్ల వద్ద నిలిచి ఉన్నాయి. కానీ డాలరు మారకంలో రూపాయి విలువ ఒక్కసారిగా 21 పైసలు క్షీణించి 83.39 వద్దకు పడిపోయింది. ఈ ప్రభావంతో దేశీయ మల్లీ కమోడిటీ ఎక్సేంజ్‌లో కేజీ వెండి ధర రూ.96.500 రికార్డుస్థాయికి పెరిగింది. ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర క్రితం రోజుతో పోలిస్తే 10 డాలర్ల మేర తగ్గినప్పటికీ, రూపాయి క్షీణత కారణంగా స్థానిక ధర కొంత పుంజుకున్నది.






