8 శాతానికి జీడీపీ వృద్ధి
న్యూఢిల్లీ, మే 29: దేశ ఆర్థిక వ్యవస్థ 2023 పూర్తి ఆర్థిక సంవత్సరంలో 8 శాతం వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ డీబీఎస్ బ్యాంక్ అంచనా వేసింది. 2024 ఆర్థిక సంవత్సరం జనవరి క్యూ4లో జీడీపీ వృద్ధి 7 శాతంపైనే నమోదవుతుందని తాము అంచనా వేస్తున్నట్టు డీబీఎస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఎకానమిస్ట్ రాధికారావు చెప్పారు. క్యూ4, పూర్తి సంవత్సరానికి జీడీపీ గణాంకాలు మే 31 శుక్రవారం వెలువడనున్న నేపథ్యలో ఆమె అంచనాల్ని వెల్లడించారు.
నాల్గవ త్రైమాసికంలో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగిందని, ఎఫ్‌ఎంసీజీ, ద్విచక్ర వాహనాలు అమ్మకాలు పుంజుకోవడమే ఇందుకు నిదర్శనమని రాధికారావు వివరించారు.దీనితో తాము జీడీపీ వృద్ధి అంచనాల్ని 7 శాతంపైకి పెంచామని, పూర్తి సంవత్సరంలో 8 శాతానికి దగ్గరగా ఉంటుందని పేర్కొన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయాలు పెరుగుతాయని, జూలైలో లోక్‌సభకు సమర్పించే బడ్జెట్లో ఈ రంగానికే ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నామని డీబీఎస్ బ్యాంక్ ఎకానమిస్ట్ చెప్పారు.
4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఇండియా
ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని ఆర్థిక సలహా మండ లి సభ్యుడు సంజీవ్ సన్యాల్ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జపాన్ ఆర్థిక వ్యవస్థను భారత్ అధిగమిస్తుందని అం చనా వేశారు. ఇటీవల ఒక సదస్సులో సన్యాల్ మాట్లాడుతూ అనిశ్చిత పరిస్థితుల నడుమ 7 శాతం వృద్ధి అనేది భారత్‌కు మంచి వృద్ధి రేటు అని చెప్పారు. ప్రస్తుతం భారత్ 3.7 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. ఇప్పుడు జపాన్ జీడీపీ మనకంటే కాస్త ఎక్కువగా 4.1 ట్రిలియ న్ డాలర్ల మేర ఉన్నదని, వచ్చే ఏడాది తొలినాళ్లలో లేదా ఈ ఏడాదే జపాన్‌ను భారత్ అధిగమించి నాల్గవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని సంజీవ్ సన్యాల్ చెప్పారు.
రెండేండ్లలో జర్మనీని మించుతాం
జర్మనీ ఆర్థిక వ్యవస్థ 4.6 ట్రిలియన్ డాలర్లని, ఆ దేశం జీడీపీ వృద్ధిచెందడం లేదని, అందుచేత రెండేండ్లలో భారత్ జర్మనీని సైతం దాటేసి మూడో పెద్ద ఎకానమీగా రూపొందవచ్చని వివరించారు. ‘మనం దాదాపు లక్ష్యాలకు దగ్గరగా ఉన్నాం’ అని చెప్పారు. ఆర్థికాభివృద్ధి రేటును 8 శాతానికి పెంచడానికి ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక చర్యలూ చేపట్టాల్సిన అవసరం లేదని సన్యాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఆ వృద్ధి రేటును (8 శాతం) సాధించగలిగితే గొప్పే, అయినా 7 శాతం వార్షిక వృద్ధి సైతం మంచిదే’ అని చెప్పుకొచ్చారు. ఈ వృద్ధి రేటుతో ఉపాధి, పన్నులు రెండూ పెరుగుతాయన్నారు. వృద్ధి మరింత వేగవంతం కావాలని ఆశించవద్దని సన్యాల్ అంటూ ఇండోనేషియా, మలేషియా తదితర దక్షిణాసియా దేశాలు 1990 దశకంలో ఇప్పుడు మనం ఉన్న స్థితిలో ఉన్నాయని, అవి అటుతర్వాత మరింత జోరుచూపించి ఒక్కసారిగా చతికిల పడ్డాయని, దానితో ఆసియా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని వివరించారు.






