29 June, 2026 | 4:09 PM

టాటా స్టీల్ లాభంలో భారీ క్షీణత

30-05-2024 12:05 AM

న్యూఢిల్లీ, మే 29: టాటా గ్రూప్ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్  నికరలాభం 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారీగా తగ్గింది. గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 64.59 శాతం క్షీణించి రూ. 1,566 కోట్ల నుంచి రూ.554 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం కూడా రూ. 63,131 కోట్ల నుంచి రూ. 56,497 కోట్లకు తగ్గింది. తమ యూకే వ్యాపారానికి సంబంధించిన పునర్‌వ్యవస్థీకరణ వ్యయాలు, ఆస్తుల తరుగుదల నష్టాలను ఒకేదఫా ఖాతాల్లో చూపించడంతో నికరలాభం క్షీణించిందని టాటా స్టీల్ తెలిపింది. బుధవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.3.60 చొప్పున డివిడెండు సిఫార్సుచేసింది.

రూ.3,000 కోట్ల నిధుల సమీకరణకు ఓకే

నాన్‌ఛీ డిబెంచర్ల జారీ ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించాలన్న ప్రతిపాదనను టాటా స్టీల్ బోర్డు ఆమోదించింది. కంపెనీ విదేశీ సబ్సిడరీ అయిన టీ స్టీల్ హోల్డింగ్స్ పీటీఈ లిమిటెడ్ ఈక్విటీ షేర్లలో 2.11 బిలియన్ డాలర్లు (రూ.17,407 కోట్లు) పెట్టుబడి చేయాలన్న ప్రతిపాదనను సైతం బోర్డు అనుమతించింది. టాటా స్టీల్ విదేశీ సబ్సిడరీల రుణాల చెల్లింపునకు, టాటా స్టీల్ యూకే లిమిటెడ్ పునర్‌వ్యవస్థీకరణ వ్యయాల కోసం ఈ నిధుల్ని ఉపయోగిస్తారు.