4 July, 2026 | 10:29 AM

వెండే బంగారమాయెనే!

21-05-2024 02:13 AM

తొలిసారిగా రూ.లక్ష దాటిన కేజీ వెండి ధర

రూ.4,500 పెరిగిన వైనం

రూ.75 వేల మార్కు దాటిన తులం బంగారం

హైదరాబాద్, మే 20: ప్రపంచ మార్కెట్లో ఉవ్వెత్తున పెరిగిన ప్రభావంతో భారత్‌లోనూ వెండి బంగారం రెండూ కొత్త రికార్డు స్థాయిలకు చేరాయి. సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఒక్క ఉదుటన రూ.540 మేర పెరిగి రూ.75,160 చరిత్రాత్మక గరిష్ఠ స్థాయినిఅందుకుంది. తొలిసారిగా బంగారం రూ.75 వేల మార్కు దాటడం గమనార్హం. ఇటీవల నెలకొల్పిన రూ.74,620 రికార్డు ధరను తాజాగా అధిగమించింది. 22 క్యారట్ల పుత్తడి తులం ధర రూ.500 పెరిగి రూ.68,900 వద్ద నిలిచింది. వెండి మరింత భారీగా పెరిగింది. హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో కేజీ వెండి ధర ఒక్క ఉదుటన రూ.4,5000ఎగిసి రూ.1,01,000 వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది.

ప్రపంచ మార్కెట్ల ప్రభావం

యూఎస్ కేంద్ర బ్యాంక్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు బలపడటంతో శుక్రవారం రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి, వెండి భారీగా పెరిగాయి. ఔన్సు పుత్తడి ఫ్యూచర్ ధర 30 డాలర్లకుపైగా పెరిగి మళ్లీ  2,440 డాలర్ల రికార్డుకు చేరింది. దీంతో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో సైతం పూర్తి స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర రూ.73,700 స్థాయికి చేరింది. ఇదే సమయంలో ప్రపంచ మార్కెట్లో ఔన్సు వెండి ధర 32.5 డాలర్ల స్థాయికి పెరిగింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడి వెండి, బంగారం ధరలు పెరిగాయని బులియన్ ట్రేడర్లు చెబుతున్నారు.