25 June, 2026 | 2:25 PM

Breaking News

SIR ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

25-06-2026 01:34 PM
  1. ఓటరు జాబితా సవరణలో మొదటి దశను పకడ్బందీగా నిర్వహించాలి
  2. ఇంటింటికీ వెళ్ళి ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలు అందించాలి
  3. పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల ప్రతినిధులు భాగస్వాములు కావాలి
  4. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బీఎల్ఓకు వివరాలు నమోదు చేసిన వ్యక్తిగత ఎన్యుమరేషన్ ఫారమ్‌ను అందజేసిన జిల్లా కలెక్టర్

ఖమ్మం, జూన్- 25 (విజయక్రాంతి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా జూన్ 25 నుంచి జూలై 24 వరకు నిర్వహించే హౌస్-టు-హౌస్ ఎన్యుమరేషన్ ప్రక్రియ అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. గురువారం ప్రారంభమైన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరం 46వ డివిజన్‌లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బీఎల్ఓ జిల్లా కలెక్టర్‌కు వ్యక్తిగత ఎన్యుమరేషన్ ఫారమ్‌ను అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వయంగా ఫారమ్‌లో వివరాలు నమోదు చేసి అధికారులకు తిరిగి సమర్పించారు. ఎస్ఐఅర్ కార్యక్రమ నిర్వహణ, ఫారమ్‌ల పంపిణీ, సేకరణ విధానాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి అర్హత గల ఓటరును గుర్తించి, వారి వివరాలను సక్రమంగా నమోదు చేయడం ద్వారా పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఎన్నికల సంఘానికి క్షేత్రస్థాయి ప్రతినిధులుగా వ్యవహరిస్తారని, వారి పని తీరుపైనే ఈ కార్యక్రమం విజయవంతం ఆధారపడి ఉంటుందని అన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసే సమయంలో ప్రజలకు తలెత్తే సందేహాలను నివృత్తి చేస్తూ, కార్యక్రమంపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.

జూన్ 25 నుంచి జూలై 24 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో మొదటి నాలుగు నుంచి ఐదు రోజులలోపు ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫారమ్‌లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఫారమ్‌లను అందజేసే సమయంలో వాటిని పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని కుటుంబ సభ్యులకు తెలియజేయాలని, తదుపరి సందర్శనలో వాటిని సేకరిస్తామని స్పష్టం చేయాలని చెప్పారు. ఫారమ్‌లు సమర్పించని పక్షంలో సంబంధిత వ్యక్తుల పేర్లు డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో కనిపించవని ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు. నిరక్షరాస్యులు, వృద్ధులు, దివ్యాంగులు లేదా ఫారమ్‌లు స్వయంగా నింపలేని వారికి బీఎల్ఓలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఓటరుకి తప్పని సరిగా ఎన్యుమరేషన్ ఫారమ్ అందేలా చూడాలని, ఇంట్లో లేని సందర్భాల్లో కనీసం మూడు సార్లు సందర్శించి ఫారమ్ అందించే ప్రయత్నం చేయాలని సూచించారు. ఫారమ్ పంపిణీ జరిగినట్లు రసీదు లేదా ఇతర ఆధారాలు భద్రపరచుకోవాలని తెలిపారు.

2002 ఓటరు జాబితాలో ఇప్పటికే పేరు ఉన్న అర్హులైన ఓటర్ల నుంచి ఈ దశలో ఎలాంటి సహాయక పత్రాలు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఓటరు జాబితాను 2002 జాబితాతో మ్యాపింగ్ చేసి, వివరాలు ధృవీకరించి సంతకం తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. జూలై 31న ప్రచురించే డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ఎన్యుమరేషన్ ఫారమ్‌లు సమర్పించిన వారి పేర్లు మాత్రమే ఉంటాయని, ఫారమ్‌లు ఇవ్వని వారి పేర్లు జాబితాలో కనిపించకపోవచ్చని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో నివాసం మారిన వారు, అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు, కొత్తగా వచ్చిన నివాసితుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని సూచించారు. ఇతర నియోజక వర్గాల్లో ఓటర్లుగా ఉన్నవారిని ఫారమ్-8 ద్వారా ఓటు బదిలీ చేయించే చర్యలు చేపట్టాలని తెలిపారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి అర్హుడికి ఫారమ్-6 అందించి కొత్త ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు.

ఎవరైనా ఓటరు మరణించినట్లు, నివాసం మార్చుకున్నట్లు లేదా అక్కడ నివసించడం లేదని సమాచారం వచ్చినప్పుడు తగిన ఆధారాలు, స్థానికుల వాంగ్మూలాలు నమోదు చేయాలని, సరైన ధృవీకరణ లేకుండా ఏ ఓటరు పేరును తొలగించరాదని స్పష్టం చేశారు. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత, నిష్పాక్షికత తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పాల్గొంటున్న బీఎల్ఓలు, సూపర్వైజర్లు, ఏఈఆర్వోలు, ఈఆర్వోలు, రాజకీయ పార్టీల బీఎల్ఏలు రాబోయే మూడు నెలలపాటు ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించి పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి అర్హుడైన ఓటరుని చేరుకుని వారి వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా ఈఆర్వోలు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ఫారమ్‌ల పంపిణీ నుంచి సేకరణ వరకు ప్రతి దశలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బీఎల్ఓలు తమ సాధారణ విధులతో పాటు ఎన్నికల సంఘం నిర్దేశించిన ఎస్‌ఐఆర్ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్వోలు, బీఎల్ఓలు, బీఎల్ఏలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.