24 July, 2026 | 9:37 PM

కేసీఆర్ కృషితోనే సీతారామ ప్రాజెక్టు

28-06-2024 12:19 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): సాగునీటి రంగంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కృషికి సీతారామ ప్రాజెక్టు  మరో నిదర్శమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కే తారకరామారావు అన్నారు. గురువారం ఎక్స్ వేదిక స్పందిస్తూ ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పరిధిలోని 10 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందనుందన్నారు. కేసీఆర్ పాలనలో 70 శాతం పనులు పూర్తియ్యాయని, రూ.17 వేల కోట్ల అంచనాతో ఆ ప్రాజెక్టు చేపట్టామని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఇంజినీర్లు, అధికారులు, ఏజెన్సీలు, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. 

జాబ్ క్యాలెండర్ ఏది?

తెలంగాణలో నిరుద్యోగులకు మద్దతుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్ కదం తొక్కుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం నందినగర్‌లోని తన నివాసంలో ఆయనను కలిసిన నిరుద్యోగులతో మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రచారం చేసిందని, ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నో హమీలిచ్చినా అమలు చేయడం లేదని నిరుద్యోగులు చెప్పారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రచారం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని విమర్శించారు. గ్రూప్ 2లో రెండు వేల ఉద్యోగాలు పెంచుతామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా పెరగలేదన్నారు. మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ చేశారని మండిపడ్డారు. తెలంగాణ యువత తరుఫున కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తున్నామని తెలిపారు. వాళ్ల హామీల ప్రకారం ఇప్పటికే పది నోటిఫికేషన్లు రావాలని, కానీ ఒక్కటీ ప్రకటించ లేకపోయారని దుయ్యబట్టారు.