రామోజీకి ‘భారతరత్న’కు కృషి
- ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు
- రామోజీ ప్రజాసంక్షేమం గురించే మాట్లాడేవారు
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
- రాజధాని నిర్మాణానికి ఈనాడు ఎండీ కిరణ్ రూ.10 కోట్ల విరాళం
హైదరాబాద్,జూన్ 27 (విజయక్రాంతి): రామోజీ గ్రూప్ సంస్థల అధినేత దివంగత రామోజీరావుకు భారతరత్న వచ్చేందుకు కృసి చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడ శివారు అనమోలు గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభకు చంద్రబాబు దంపతులు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రామోజీరావు కుటుంబ సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు ఎన్ రామ్, శేఖర్‌గుప్తా, గులాబ్ కోఠారి, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు హజరై పుష్పాంజలి ఘటించారు. పత్రికా రంగంతో పాటు వివిధ రంగాల్లో అందించిన రామోజీరావుకు సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. వేదిక వద్ద రామోజీరావు జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నీతి, నిజాయితీకి ప్రతిరూపమైన రామోజీరావు మారుమూల గ్రామంలో పుట్టి పట్టుదలతో అత్యున్నత స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. తాను ఎంచుకున్న ప్రతి రంగంలోనూ నెంబర్ వన్ నిలిచారన్నారు. 1974 అగస్టు 10న ఈనాడు పత్రిక విశాఖలో ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు. రామోజీరావు పత్రికా రంగంలో ఉండి నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడారని, జిల్లా ఎడిషన్లు తెచ్చి క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలు ప్రస్తావించారని, ఆయన ఎంతో మంది నటులు, కళాకారులు, జర్నలిస్టులకు జీవితం ఇచ్చారన్నారు. మార్గదర్శి సంస్థను దెబ్బతీయాలని అనేక ప్రభుత్వాలు యత్నించాయన్నారు. నవ్యాంధ్ర రాజధానికి ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్న సమయంలో అమరావతి పేరును సూచించినట్లు తెలిపారు.
అమరాతికి రూ.10 కోట్లు విరాళం
ఈనాడు ఎండీ చెరుకూరి కిరణ్ మాట్లాడుతూ.. ప్రజల హక్కులను పాలకులు కబళించినప్పుడల్లా రామోజీరావు బాధితుల పక్షం నిలిచేవారన్నారు. దేశంలో ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.10 కోట్లు విరాళం ఇస్తున్నట్లు చెప్పారు.
ప్రజాకోణంలో మాట్లాడేవారు: పవన్ కల్యాణ్
రామోజీరావును తాను 2008లో మొదటిసారి కలిశానని పవన్‌కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడే విధానం నన్ను చాలా ఆకర్షించిందని, ప్రజా సంక్షే మం కోణంలోనే ఎప్పుడూ మాట్లాడేవారని తెలిపారు. ఆయన మాటల్లో జర్నలిజం విలువలు, పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో తెలిసిందన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యల గురించే పత్రికలో రాసేవారని గుర్తు చేశారు.






