24 July, 2026 | 10:23 PM

సింగరేణిని నష్టాల్లోకి నెట్టే కుట్రలు

28-06-2024 12:18 AM
  1. బీజీపీ, కాంగ్రెస్ ఒక్కటై అమ్మకానికి పెట్టే ప్రయత్నాలు
  2. మా పాలనలో వేలం జరిగినా తట్టెడు బొగ్గు ఎత్తనివ్వలేదు
  3. సింగరేణిని కాపాడేందుకు పోరాడుతున్నం: కేటీఆర్

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రాంత నాయకులు, పార్టీ సీనియర్లు, బొగ్గు గని కార్మిక సంఘ నాయకులతో తెలంగాణ భవన్‌లో సమావేశమై కార్యాచరణపై చర్చించారు. కేంద్రంతో రాష్ట్ర సీఎం కుమ్మకై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంస్థ నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారని తెలిపారు.

కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలతో ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్నారని, సకల జనుల సమ్మె సమ యం లో సింగరేణి ప్రాధాన్యాన్ని దేశం గుర్తించిందన్నారు. సమ్మె కాలంలో 5 దక్షిణాది రాష్ట్రా లు ఇబ్బందులు పడ్డాయని గుర్తుచేశారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఉద్యమ కాలంలో అద్భుతంగా పనిచేశాయన్నారు. సంస్థల బలోపేతం అనేది బీఆర్‌ఎస్ విధానమని స్పష్టం చేశారు. అందుకే ప్రైవేటు కంపెనీలు ఎంత ఒత్తిడి తెచ్చినా పక్కకు పెట్టి రైతు బీమాను ఎల్‌ఐసీకి ఇచ్చామని, విద్యుత్ ప్రాజెక్టులను కట్టే బాధ్యతలను బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించామని గుర్తుచేశారు.

బీఆర్ ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లపాటు సింగరేణి అభివృద్ధి, విస్తరణ కోసం ఎలా పనిచేశామో ప్రతి కార్మికునికి అవగాహన ఉందని అన్నారు. కేసీఆర్‌అధికారంలో ఉన్నప్పుడు బొగ్గు గనులను వేలం వేయకుండా ఆపినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రెండు బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు కేటాయించినా  తట్టెడు బొగ్గును ఎత్తకుండా అడ్డుకుని సంస్థ లు పారిపోయేలా చేశామన్నారు. సింగరేణిని బీఆర్‌ఎస్ తప్పకుండా కాపాడుకుంటా మన్నారు. తెలంగాణ గొంతుక పార్లమెంటులో లేకపోవడంతో ఆ రెండు పార్టీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయన్నారు.