పంట మార్పిడిపై డప్పు ప్రచారం!
మహబూబాబాద్,(విజయక్రాంతి): డప్పు చప్పుళ్లు... జానపద గీతాలు... మధ్యలో వ్యవసాయ సందేశాలు... ఇదేదో సాంస్కృతిక కార్యక్రమం కాదు. రైతుల్లో పంట మార్పిడిపై చైతన్యం కల్పించేందుకు బయ్యారం మండల వ్యవసాయ అధికారి రాజు చేపట్టిన వినూత్న ప్రచారం. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో వ్యవసాయ అధికారి రాజు ఆధ్వర్యంలో పంట మార్పిడిపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులతో కలిసి గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ డప్పు కొట్టారు.
జానపద పాటల ద్వారా పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు సులువుగా వివరించారు. ఒకే పంటను వరుసగా సాగు చేయడం వల్ల నేల సారం తగ్గిపోతుందని, వరి, మొక్కజొన్న పంటల్లో అధికంగా యూరియా వినియోగించడం వల్ల నేల నాణ్యత దెబ్బతినడంతో పాటు సాగు ఖర్చులు పెరిగే ప్రమాదం ఉందని వివరించారు. పంట మార్పిడిని పాటించడం, సమతుల్యంగా ఎరువులు వినియోగించడం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడి, అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు. ఈ అవగాహన కార్యక్రమానికి గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో హాజరై వ్యవసాయ శాఖ సూచనలను ఆసక్తిగా ఆలకించారు.






