20 August, 2026 | 8:26 AM

10 సెకండ్లలోనే ఎస్‌ఎంఈ రుణ మంజూరీలు

12-06-2024 12:30 AM

ఎస్బీఐ డిజిటల్ బిజినెస్ లోన్స్

న్యూఢిల్లీ, జూన్ 11: చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు త్వరితంగా రుణాలు జారీచేసేందు కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ఎస్‌ఎంఈ డిజిటల్ బిజినెస్ లోన్స్ విభాగాన్ని ప్రవేశపెట్టింది. ఆదాయపు పన్ను శాఖ, జీ ఎస్టీ రిటర్న్‌లు, బ్యాంక్ స్టేట్ మెంట్లు తదితర డేటాను ఉపయోగించి ఈ విభాగం ద్వారా ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా పది సెకండ్లలోనే రుణ మంజూరీ చేయనుంది.

రూ.50 లక్షల రుణం వరకూ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వాటి ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లు సమర్పించనక్కర్లేదని, లావాదేవీల చరిత్ర, జీఎస్టీ రిటర్న్‌ల ఆధారంగా రుణ మంజూరీ చేయనున్నట్టు ఎస్బీఐ వివరించింది. వచ్చే కొద్ది ఏండ్లలో ఎంఎస్‌ఎంఈ రుణాలు తమ బ్యాంక్ వృద్ధికి, లాభదాయకతకు ప్రధాన మార్గంగా గుర్తించామని ఎస్బీ ఐ చైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ లోన్ ప్లాట్‌ఫాం ద్వారా రుణ మంజూరీ సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. 2024 మార్చి ముగింపునాటికి ఎస్‌ఎంఈ విభాగంలో ఎస్బీఐ రుణాల వృద్ధి 20 శాతంకా గా, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఇచ్చిన రుణాలు రూ. 4 లక్షల కోట్లను మించాయి.

అన్ని బ్యాంక్ చానల్స్ ద్వారా యాక్సెస్

 తమ ఎస్‌ఎంఈ డిజిటల్ లోన్స్ ప్రొడక్ట్‌ను తమ వెబ్‌సైట్, బ్యాంక్ శాఖలు, ఎస్‌ఎం ఈ సెంటర్లు, ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్స్‌లో తమ బ్యాంక్ చానల్స్ అన్నింటిద్వారా యాక్సెస్ చేసుకోవచ్చని ఎస్బీఐ వెల్లడించింది. రానున్న నెలల్లో ఈ ప్రొడక్ట్‌ను పార్టనర్ టచ్‌పాయింట్స్‌లో ప్రవేశపెడతామని, అవుట్‌డోర్ టచ్‌చపాయింట్లలో క్యూఆర్ కోడ్స్ ద్వారా అందిస్తామని ఎస్బీఐ రిటైల్ బ్యాంకింగ్, ఆపరేషన్స్ ఎండీ వినయ్ తోన్సె చెప్పారు.

ఎస్బీఐ 3 బిలియన్ డాలర్ల రుణ సమీకరణ

న్యూఢిల్లీ, జూన్ 11: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 బిలియన్ డాలర్ల రుణాన్ని మార్కెట్ల నుంచి సమీకరించాలని నిర్ణయించింది. యూఎస్ డాలర్లు లేదా మరేఇతర విదేశీ కరెన్సీ రూపంలో సీనియర్ అన్‌సెక్యూర్డ్ బాండ్లను పబ్లిక్ ఆఫర్ ద్వారా లేదా ప్రైవేట్ ప్లేస్‌మెంట్‌లో జారీచేసి ఈ నిధుల్ని సమీకరించాలని ఎస్బీఐ ప్రతిపాదించింది. దేశంలో రుణాలకు వస్తున్న డిమాండ్ దృష్ట్యా భారతీయ బ్యాంక్‌లు వాటి క్యాపిటల్ బేస్‌ను పెంచుకోవాలని చూస్తున్న నేపథ్యంలో ఎస్బీఐ డైరెక్టర్ల బోర్డు 3 బిలియన్ డాలర్ల రుణ సమీకరణకు గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చింది. ఒకటి లేదా వివిధ దశల్లో సీనియర్ అన్‌సెక్యూర్డ్ నోట్స్ జారీచేయనున్నట్లు ఎస్బీఐ తెలిపింది.