డిపాజిట్లు పెంపునకు తహతహ
ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీల లాక్‌ఇన్ పిరియడ్ తగ్గించాలి
డిపాజిటర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి పీఎస్‌యూ బ్యాంక్‌ల వినతి
న్యూఢిల్లీ, జూన్ 11: పెరుగుతున్న రుణ డిమాండ్‌కు తగినరీతిలో డిపాజిట్ల వృద్ధి లేక ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు డిపాజిట్లు పెంచుకునేందుకు చర్యలు చేపట్టాయి. రిటైల్ డిపాజిట్ల వృద్ధి మందగించడంతో రుణాలు, డిపాజిట్ల మధ్య వ్యత్యాసాన్ని పూడ్చుకునేందుకు అధిక వడ్డీ వ్యయంతో కూడిన సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్‌లను (సీడీలు) బ్యాంక్‌లు ఆశ్రయిస్తున్నాయి. డిపాజిట్ల తగ్గుదలపై ఆందోళన చెందుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఈ అంశాన్ని కేంద్రంలోని సీనియర్ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి.
డిపాజిట్లు పెంచుకోవడానికి డిపాజిటర్లకు తాము ప్రోత్సాహాకాలివ్వడానికి అనుమతించాలని అధికారులకు విన్నవించాయి. డిపాజిట్ల పెంపునకు తాము పలు సూచనలు చేశామని, అందులో ఒకటి ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్ల లాక్‌ఇన్ పిరియడ్‌ను ఐదేండ్ల నుంచి మూడేండ్లకు తగ్గించాలని కోరినట్టు సీనియర్ బ్యాంక్ అధికారి ఒకరు చెప్పారు. ఇటీవలకాలంలో ఈక్విటీ మార్కెట్ల నుంచి అధికరాబడులు వస్తున్నందున, ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు బదులు మ్యూచువల్ ఫండ్స్, టాక్స్‌సేవింగ్ ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్‌ఎస్‌ఎస్)పై ఇన్వెస్టర్లు మొగ్గుచూపిస్తున్నారని బ్యాంకర్లు తెలిపారు.
ఈ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ అన్నింటికీ ఐదేండ్ల లాక్‌ఇన్ పిరియడ్ ఉంటుంది. బ్యాంక్‌ల క్రెడిట్ డిపాజిట్ రేషియో ఆరోగ్యకరంగా ఉండాలంటే ట్యాక్స్‌సేవింగ్ ఎఫ్‌డీల లాన్‌ఇన్ సమయాన్ని మూడేండ్లకు తగ్గించాలని బ్యాంకర్లు కోరుతున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాలు 16.3 శాతం వృద్ధిచెందగా, డిపాజిట్లు 12.9 శాతమే పెరిగాయి. ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ పొదుపు మార్గాలను ఎంచుకోవడమే డిపాజిట్ల మందకొడి వృద్ధికి కారణం.






