తెగిపడిన 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ వైర్లు
సిరిసిల్ల, జులై 03(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. పెద్దూర్ బస్టాండ్ సమీపంలో ఉన్న 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ వైర్లు అకస్మాత్తుగా తెగి జనవాసాలపై పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్దాలతో విద్యుత్ తీగలు ఇళ్లపై పడటంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలు ఇళ్లలో టీవీలు, విద్యుత్ వైరింగ్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు షార్ట్ సర్క్యూట్‌కు గురై దెబ్బతిన్నట్లు బాధితులు చెబుతున్నారు.
అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు,సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరాను నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టారు. తెగిపోయిన విద్యుత్ లైన్‌ను వెంటనే తొలగించి కొత్త లైన్ ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.






