2 June, 2026 | 2:43 AM

సామాజిక అన్యాయం!

02-06-2026 12:00 AM

పుల్లెంల గణేష్ :

* తెలంగాణ ఉద్యమం భౌగోళిక విభజన కోసం జరిగిన పోరాటం కాదు. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రజల హక్కుగా దక్కాలనే సంకల్పంతో దశాబ్దాలపాటు సాగిన ప్రజా ఉద్యమం అది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలక వర్గాల ఆధిపత్యం వల్ల తెలంగాణ ప్రజలు ఎంతో వివక్షకు గురయ్యారు. అందుకే తమ వనరులపై తమకే హక్కు ఉండాలని గట్టిగా గర్జించారు.

వేలాది మంది విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, రైతులు పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణను సాధించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు దాటినా, ఉద్యమం ఆశించిన సామాజిక న్యాయం పూర్తిస్థాయిలో ఆచరణలో కనిపించడం లేదనే ప్రశ్న సమాజంలో బలంగా వినిపిస్తోంది.

ఉద్యమ కాలంలో వనరుల దోపిడీ గురించి మాట్లాడాం. మరి నేడు స్వరాష్ట్రంలో ఆ వనరుల పంపిణీ ఎలా జరుగుతోంది? తెలంగాణలో భూములు, పెద్ద పెద్ద వ్యాపారాలు, కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలు, కీలకమైన ఆర్థిక వనరులు నేటికీ కొన్ని పరిమిత సామాజిక వర్గాల (భూస్వామ్య ఆధిపత్య కులాల) చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి.

శ్రమ దోపిడీకి గురవుతున్న సబ్బండ కులాలు నేటికీ సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే మిగిలిపోతున్నారు తప్ప, వారు ఆర్థిక శక్తులుగా, పారిశ్రామికవేత్త లుగా ఎదిగే వాతావరణం కనిపించడం లేదు. సంక్షేమం అనేది తాత్కాలిక ఉపశమనమే కానీ, అది శాశ్వత ఆర్థిక సాధికారతను లేదా సామాజిక న్యాయాన్ని ఇవ్వలేదు.

రాజ్యాధికారంలో అసమానతలు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ‘రాజ్యాధికారమే మాస్టర్ కీ (అన్ని సమ స్యలకు తాళంచెవి)’ అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఏ సామాజిక వర్గమైనా ఆత్మగౌరవంతో బతకాలంటే వారికి చట్టసభ ల్లో, ప్రభుత్వ నిర్ణయాధికారాల్లో సరైన ప్రాతినిధ్యం ఉం డాలి. తెలంగాణ జనాభాలో సుమారు 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చట్టసభల్లో లభిస్తున్న ప్రాతినిధ్యం ఎంత? కేవలం 10 శా తం కంటే తక్కువ ఉన్న అగ్రకులాలు ఇప్పటికీ ముఖ్యమంత్రి పీఠాన్ని, కీలక మంత్రిత్వ శాఖలను, రాజకీయ వ్యవస్థలను నియంత్రిస్తున్నాయి. రాజకీయ పార్టీలు కూడా ఈ ఆధిపత్య కులాల ఆర్థిక, సామాజిక బలాల ముందు మోకరిల్లుతున్నాయి. ఇది పాలకుల మార్పు మాత్రమే తప్ప, పీడిత ప్రజల అధికార మార్పిడి కాదు.

సమాన వాటా దక్కుతున్నదా? 

తెలంగాణ రాష్ట్ర జనాభాలో దాదాపు 90% మం ది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ప్రజలే ఉన్నా రు. సంఖ్యలో మెజార్టీగా ఉన్న ఈ వర్గాలకు రాజ్యాధికారంలో, పాలనలో, ఉద్యోగాల్లో, వనరుల పంపి ణీలో, భూముల్లో, వ్యాపార రంగాల్లో సమాన వాటా దక్కుతున్నదా? అనే ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అధికార వ్యవస్థలో, రాజకీయ నాయకత్వంలో, భూముల యాజమాన్యంలో, ఆర్థిక అవకాశాల్లో కొన్ని అగ్రకులాలకే ప్రధాన ప్రాధా న్యం కొనసాగుతున్నదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యం గా భూస్వామ్య ఆధిపత్య కులాల చేతుల్లోనే అధికారం, ఆర్థిక వనరులు కేంద్రీకృతమవుతున్నాయనే భావన సామాన్య ప్రజల్లో ఉంది.

తెలంగాణ కోసం పోరాడిన మెజార్టీ ప్రజలు తమ జీవితాల్లో మార్పు ఆశించారు. తమ పిల్లలకు ఉద్యోగాలు, తమ కుటుంబాలకు భూము లు, తమ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం, తమ సమాజానికి గౌరవం వస్తుందని నమ్మారు. కానీ, ఆ ఆశలు నెరవేరకపోతే, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన ఫలితం కొద్ది వర్గాలకు మాత్రమే పరిమితమైందనే ఆవేదన సహజమే.

పాలనలో భాగస్వామ్యం ఉండాలి

ప్రత్యేక తెలంగాణ అంటే కేవలం కొత్త సరిహద్దులు కాదు; ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించే కొత్త సామాజిక వ్యవస్థ కూడా కావాలి. రాజ్యాంగం చెప్పిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం తెలంగాణలో నిజంగా అమలు కావాలంటే ప్రతి కులానికి, ప్రతి వర్గానికి వారి వారి జనాభా దామాషా ప్రకారం పాలనలో భాగస్వామ్యం ఉండాలి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు రాష్ట్ర నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు.

అలాంటి వర్గాలకు అధికారంలో సముచిత స్థానం దక్కకపోతే, అది తెలంగాణ ఉద్యమ ఆత్మకు విరుద్ధం అవుతుంది. సమాన భాగస్వామ్యం, సమాన అవకాశాలు, సమాన గౌరవం ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమానికి నిజమైన అర్థం ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ కోసం అమరులైన వారి త్యాగాలకు నిజమైన నివాళి అంటే సామాజిక న్యాయం సాధించడమే.

మెజార్టీ ప్రజలకు అన్ని రంగాల్లో సమాన పంపిణీ జరిగినప్పుడే తెలంగాణకు పూర్తి గౌరవం దక్కుతుంది. ప్రతి వర్గం తమ వాటాను పొందినప్పుడే ఈ రాష్ట్రం నిజమైన ప్రజాస్వామ్య తెలంగాణగా నిలుస్తుంది. సామాజిక న్యాయం జరిగినప్పుడే తెలంగాణ ఉద్యమ లక్ష్యం సంపూర్ణం అవుతుంది. జనాభా దామాషా ప్రకారం ప్రతి వర్గానికి వాటా దక్కినప్పుడే సాధించుకున్న తెలంగాణకు నిజమైన గౌరవం లభిస్తుంది.

 వ్యాసకర్త సెల్: 9553041549